
కూటమి మోసం.. దివ్యాంగులకు శాపం
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమైంది. సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను తొలగిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ.. 15 వేలు’, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు అంటూ ఊరించారు. ఏరివేతలో భాగంగా వికలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్య శాతం తగ్గించి నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. వచ్చే నెల నుంచి పింఛన్ రాదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. – సాక్షి, నెట్‌వర్క్
మాటలకందని ఆవేదన..
● గతంలో అధికారులు ఇచ్చిన 98 శాతం వికలత్వం సర్టిఫికెట్ చూపుతున్న ఈ మహిళ పేరు గొల్ల అరుణ. కోసిగి మండలం వందగల్లు సొంతూరు. పుట్టుకపోతోనే చెవిటి, మూగ. తన బాధ, సంతోషాన్ని ఇతరులతో పంచుకునే భాగ్యం లేదు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినిపించలేని పరిస్థితి. గతంలో ఇచ్చే దివ్యాంగుల పింఛన్‌ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలిపేస్తామని నోటీసు ఇవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తమలాంటి వారికి సాయం చేసి ఆదుకోవాలే తప్ప.. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అంటూ గొల్ల అరుణ మూగ సైగలతో వాపోతోంది.