
జిల్లాలో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అధిక వర్షాల కారణంగా జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉద యం వరకు చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. గూడూరులో 21 మి.మీ, ఆదోని లో 17.6, మంత్రాలయంలో 16, సి.బెలగల్‌లో 14.6, ఎమ్మిగనూరులో 12.4, ఓర్వకల్‌లో 11.6, గోనెగండ్లలో 10 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం సగటున 7.1 మి.మీ వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత జిల్లాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
1676 హెక్టార్లలో పంట నష్టం
కర్నూలు(అగ్రికల్చర్):అధిక వర్షాల వల్ల జిల్లా లో 1,676 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుగ్గలి, పెద్దకడుబూరు, ఆస్పరి, కౌతాళం, ఆదోని, దేవన కొండ, మద్దికెర మండలాల్లోని 36 గ్రామాల్లో అధిక వర్షాల ప్రభావం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. పత్తి 984 హెక్టార్లు, కంది 357 హెక్టా ర్లు, వేరుశనగ 107 హెక్టార్లు, ఆముదం 98 హెక్టా ర్లు, సజ్జ 148 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలు మరో 20 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంత్రాలయం: తుంగభద్ర నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు సూచించారు. మంగళవారం మంత్రాలయం మఠం సమీపంలోని నదీ తీరాన్ని సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజల్‌లతో కలిసి పీఠాధిపత్రి పర్యవేక్షించారు. తుంగభద్ర నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. వరద నీరు గంగమ్మ గుడి, పుష్కర ఘాట్లను తాకినట్లు గుర్తించారు. భక్తులు నదిలో స్నానాలు చేయకుండా నిలిపి వేయాలని, షవర్ల వద్ద స్నానాలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. నది తీరం వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరారు.