
25 ఏళ్ల చంటి బిడ్డ.. అయినా అనర్హుడే
● మంచంపై కూర్చున్న యువకుడికి 25 ఏళ్లు. పేరు షమీవుల్లా. అతడికి అన్నం తినిపిస్తున్నది తల్లి జమాల్‌బీ. పాతికేళ్ల వయస్సులో కూడా చంటి బిడ్డలా తల్లి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు, కుడి చేయి, కుడి కాలు పని చేయవు, ప్రతి క్షణం వెంట ఓ మనిషి ఉండాల్సిందే. స్వతహాగా ఏ పని చేసుకోలేడు. 2011లో వంద శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చారు. రూ.200 నుంచి ఇప్పటి వరకు పింఛన్ తీసుకుంటున్నాడు. అన్నం కూడా వేరే వారే తినిపించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటి పింఛన్‌దారుడికి ఇటీవల నంద్యాలలో నిర్వహించిన సదరం క్యాంపులో 40 శాతం కంటే తక్కువ వికలత్వం ఉందని, ఇక నుంచి పింఛన్ తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసు అందజేశారు. చూసిన వారంతా ‘ఇతనికి పింఛన్ తొలగించడమేమిటీ’ అని చర్చించుకుంటున్నారు.