
ఆర్‌యూసీఈలో తగ్గిన ఇంజినీరింగ్ ప్రవేశాలు
● సీఎస్‌ఈలో పూర్తిగా భర్తీ కానీ సీట్లు ● ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నిల్ అడ్మిషన్లు ● మెకానికల్‌లో ఒక్క సీటు భర్తీ
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఆర్‌యూసీఈ)లో ఇంజినీరింగ్ అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. ఏపీఈఏపీ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్ల రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం ముగిసింది. ఆర్‌యూసీఈ అడ్మిషన్ల వివరాలను పరిశీలిస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది 89 సీట్లు మిగిలిపోయాయి. వర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో సమస్యలు, హాస్టల్ నిర్వహణలో లోపాలు, ఇంజినీరింగ్ కళాశాలకు రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించడం, మరీ ముఖ్యంగా నాలుగు నెలల నుంచి కళాశాల పరిపాలన, అకడమిక్ వ్యవహారాలు చూసేందుకు ప్రిన్సిపాల్ లేకపోవడం కారణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌యూసీఈకి వర్సిటీ రిజిస్ట్రార్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. కళాశాలకు ప్రత్యేకంగా మౌలిక వసతులు లేవు. ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏఐసీటీ అనుమతితో ఏర్పడిన మొదటి ఇంజినీరింగ్ కళాశాల ఆర్‌యూసీఈ అయినప్పటికీ అడ్మిషన్లు తగ్గాయి.
సీఎస్‌ఈలో సైతం తగ్గిన ప్రవేశాలు..
అన్ని కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్‌యూసీఈలో సైతం గత ఏడాది 132 సీట్టకు 132 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది మాత్రం 132 సీట్లకు 125 భర్తీ కాగా 7 సీట్లు మిగిలిపోయాయి. ఏఐలో గత ఏడాది 66 సీట్లకు 62 భర్తీ కాగా ఏడాది ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో గత ఏడాది రెండు, ఈ ఏడాది ఒక్క అడ్మిషన్ మాత్రం వచ్చిది. కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీని నియమించి, ల్యాబ్ వసతి కల్పిస్తేనే కళాశాల మనుగడ ఉంటుందని, పలువురు మేధావులు సూచిస్తున్నారు.