
వన్‌టౌన్ సీఐపై చర్యలు తీసుకోవాలి
ఆదోని రూరల్: ఆదోని పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దళితుడు నంచర్ల రమేష్‌పై దాడి చేసిన వన్‌టౌన్ సీఐ శ్రీరామ్‌తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు, మానవ హక్కుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.జి.శ్రీనివాసులు, ఐఎఫ్‌టీయూ నాయకులు నరసన్న, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసన్న మాట్లాడుతూ.. గత జూలై నెల 30వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ప్రభాకర్ టాకీస్ వద్ద తోటి స్నేహితులతో కలిసి మాట్లాడుతున్న రమేష్‌ను సీఐ శ్రీరాములు బూతులు తిడుతూ, వాహనంలో స్టేషన్‌కు తరలించారన్నారు. స్టేషన్‌లో దారుణంగా హింసించి దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలపాలైన రమేష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, పోలీసులపై ఎదురు తిరిగాడని జూలై 31వ తేదీన రమేష్‌పై అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారన్నారు. దళితుడిపై దాడికి పాల్పడిన వన్‌టౌన్ సీఐ శ్రీరామ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వెంకటేష్, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, నాయకులు నేతప్ప, నౌనేపాటి, ప్రసాద్, గిరి, ఆనంద్, యేసోబు, దేవేంద్ర, ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.