
గుర్తుతెలియని వ్యక్తికి ప్రాణం పోశారు!
కర్నూలు(హాస్పిటల్): ఓ హోటల్‌పై నుంచి కింద పడి తీవ్ర గాయాలతో అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరాడు. అతను ఎవరో తెలియదు. ఎక్కడి వాడో వివరాలు లేవు. అతని వద్ద ఎవ్వరూ తోడు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో డ్యూటీలో ఉన్న వైద్యులు అత్యవసరంగా అతనికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. కర్నూలు బస్టాండ్ సమీపంలో ఉండే నిర్మల హోటల్‌లో పనిచేసే రవి స్వస్థలం ఒంగోలు. కొంత కాలంగా ఒక్కడే హోటల్‌లో పనిచేస్తూ ఒంటరిగా అక్కడే నిద్రించేవాడు. ఆదివారం అర్ధరాత్రి హోటల్‌పై నుంచి అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు తీసుకొచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. క్యాజువాలిటీలో డ్యూటీలో ఉన్న వైద్యులు అతన్ని పరీక్షించి ప్లీహంకు తీవ్ర గాయమైనట్లు గుర్తించారు. ఇలాంటి సమయంలో అతని ప్లీహంను తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా గుర్తుతెలియని వ్యక్తులకు ఏదైనా అవయవం తొలగించాల్సి వస్తే కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాలి. కానీ అతని వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ఆసుపత్రి ఇన్‌చార్జ్ సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటరమణకు వైద్యులు ఫోన్ చేసి విషయం తెలిపారు. వెంటనే ఆయన అత్యవసర ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చారు. ఆ వెంటనే జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ, మొదటి యూనిట్ చీఫ్ డాక్టర్ హరిచరణ్ ఫోన్ చేసి ఆయన సూచనలతో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ అహద్ అత్యవసరంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆపరేషన్ చేసి ప్లీహం తొలగించి ఆయన ప్రాణాన్ని కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏఎంసీలోని ఎస్‌యుసీఐలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం హోటల్‌కు చెందిన పలువురు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు.