నొప్పిని తగ్గించే వైద్యమేదీ! | - | Sakshi
Sakshi News home page

నొప్పిని తగ్గించే వైద్యమేదీ!

Aug 18 2025 11:59 AM | Updated on Aug 18 2025 11:59 AM

నొప్పిని తగ్గించే వైద్యమేదీ!

నొప్పిని తగ్గించే వైద్యమేదీ!

త్వరలో ప్రారంభించేందుకు చర్యలు

పెయిన్‌ క్లినిక్‌లకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. అన్ని రకాల నొప్పులను తగ్గిస్తామని ప్రకటనలు ఇచ్చే వైద్యుల సంఖ్య బాగా అధికమైంది. ఈ ప్రకటనలు చూసి వివిధ రకాల నొప్పులతో బాధపడే వారు డాక్టర్లను వెతుక్కుంటూ వెళ్తున్నారు. పెరిగిన ఆదరణలో మత్తుమందు వైద్యుల్లో అధిక భాగం ఇప్పుడు పెయిన్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పదుల సంఖ్యలో మత్తుమందు డాక్టర్లున్నా ఈ విభాగం ఏర్పాటుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత ప్రభుత్వ హయాంలో రెండు కొత్త విభాగాలు ఏర్పాటయ్యాయి. అందులో ఎమర్జెన్సీ మెడిసిన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు. వీటిలో క్యాజువాలిటీ స్థానంలోనే ఎమర్జెన్సీ మెడిసిన్‌ పేరిట వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందించాలి. ఈ విభాగానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఏవీ లేకుండా కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ విభాగంలోని ఇద్దరు వైద్యులు ఉండి సేవలందిస్తున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మరునాడు ఉదయం 9 గంటల వరకు ఈ విభాగం వైద్యులు కనిపించరు. అలాగే హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేరుతో ఒక విభాగం ఏర్పాటైంది. ఈ విభాగానికి ఇద్దరు వైద్యులు గతంలో నియమితులయ్యారు. ఈ విభాగం ఏర్పాటు కూడా ఎక్కడా చేయలేదు. అలాగే పెయిన్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. వైద్యంలో కర్నూలు కంటే వెనుకబడ్డ అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ పెయిన్‌ క్లినిక్‌ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు.

23 మంది డాక్టర్లు...45 మంది పీజీలున్నా..

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అనెస్తీషియా విభాగంలో మూడు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్‌కు ఒక్కో ప్రొఫెసర్‌ చొప్పున ముగ్గురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్‌, 16 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఏడాదికి 15 మంది పీజీలతో కలుపుకుని మూడేళ్లకు మొత్తం 45 మంది పీజీలు ఇక్కడ చదువుకుంటూ వైద్యసేవలందిస్తూ ఉన్నారు. ఈ ఆసుపత్రిలో 12 ఆపరేషన్లు థియేటర్లతో పాటు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, కేథలాబ్‌ విభాగాల్లో అనెస్తీషియా వైద్యులు సేవలందిస్తున్నారు. 23 మంది వైద్యులు, 45 మంది పీజీలున్నా ఇక్కడ పెయిన్‌ క్లినిక్‌ ఏర్పాటు కావడం లేదు.

ఎక్కువ మందికి నొప్పులే సమస్య...!

సాధారణంగా ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు వెళ్లే రోగుల్లో ఎక్కువ శాతం మంది వివిధ రకాల నొప్పులతోనే వెళ్తున్నారు. అక్కడి వైద్యులు ఇచ్చిన మందులు, పెయిన్‌ కిల్లర్లకు నొప్పులు తగ్గకపోతే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు వెళ్తున్నారు. వీరు స్టెరాయిడ్‌, పెయిన్‌ కిల్లర్‌ మందులను ఇవ్వడంతో నొప్పుల నుంచి వారికి ఉపశమనం లభిస్తోంది. దీంతో ఎక్కువ శాతం మంది ఆర్‌ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ భాగం ఇలాంటి మందులు వాడటంతో దీర్ఘకాలంలో వారికి కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. నొప్పి నివారణ మందులు వాడి కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్‌కు వచ్చే వారి సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఏటా పెరుగుతోంది.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో త్వరలో పెయిన్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తాము. ఇందులో నిపుణులైన అనెస్తెటిస్ట్‌లు సైతం మా వద్ద ఉన్నారు. అనెస్తీషియా విభాగంతో చర్చించి త్వరలో పెయిన్‌క్లినిక్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాము.

–డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

పెద్దాసుపత్రిలో కానరాని పెయిన్‌క్లినిక్‌

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికంగా ఏర్పాటు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులున్నా

ఏర్పాటుకాని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement