
నేడు ఈరన్నస్వామి పల్లకోత్సవం
కౌతాళం/కోసిగి: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఈరన్నస్వామి పల్లకోత్సవాన్ని నిర్వహించనున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారి పల్లకోత్సవం కోసిగి మండలంలోని కందుకూరు వద్ద తుంగభ్రనది వద్దకు చేరుకుని జలాభిషేకం చేసుకుని సాయంత్రం ఉరుకుంద గ్రామానికి చేరుకుంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కాగా.. పల్లకోత్సవాన్ని పురస్కరించుకొని కోసిగి మండలం కందుకూరు గ్రామంలో ప్రజలు పండుగ జరుపుకుంటారు. క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో స్వామివారి దర్శనార్థం వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బి.మురళీమోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.
ఉప్పొంగిన వేదావతి నది
హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామం వద్ద వేదావతి నది ఉప్పొంగింది. దీంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వేదావతి నదికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. అతి కష్టంపై నదిలో పుట్టి ప్రయాణం చేస్తూ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోని గూళ్యం గ్రామానికి చేరుకుంటున్నారు. నదిపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కూలిపోయిన బ్రిడ్జి
ఆస్పరి: యాటకల్లు గ్రామ సమీపంలో పెద్ద వాగుపై నిర్మించిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయింది. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యాటకల్లు, తొగలుగల్లు, దొదగొండ, ఐనకల్లు గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ గ్రామాల నుంచి ప్రతి రోజూ ఆస్పరిలోని ప్రైవేట్ పాఠశాలలకు 200 మంది విద్యార్థులను బస్సుల్లో వెళ్తుంటారు. ఆదివారం పాఠశాలలకు సెలవు అయినందున బస్సులు తిరగలేదు. ముప్ఫై ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి పడిపోయే స్థితిలో ఉందని మూడు నెలలు నుంచి మండల అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు విన్నవించినా పట్టించుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జికి రక్షణగా ఉన్న గోడలు కొట్టుకుపోయాయి. ఈ బ్రిడ్జి మీదుగా రాత్రి వేళల్లో ఆస్పరి నుంచి ఎమ్మిగనూరుకు వాహనాలు వెళ్తుంటాయి. ప్రాణాపాయం జరగకముందే ఆధికారులు బ్రిడ్జి దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి, నూతన బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది.
మూడు గేట్ల నుంచి
నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతుండడంతో తెరిచిన గేట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మూడు రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 79,269 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నేడు ఈరన్నస్వామి పల్లకోత్సవం