
కృష్ణుడి కోసం రైల్వే స్టేషన్!
బేతంచెర్ల: రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది దేవుడి కోసం ఆలయాలు నిర్మించడం తెలుసుకానీ.. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ కోసం రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆశ్చర్యపోతున్నారా.. ప్రయాణికుల కోసం స్టేషన్ ఏర్పాటు చేసి ఉంటారే అని కొట్టిపారేసుందుకు చుట్టు పక్కల పల్లెలు కూడా లేవు. స్టేషన్ చుట్టూ కొండ ప్రాంతం. గుంటూరు – గుంతకల్లు రైల్వే మార్గంలో పాణ్యం – సిమెంట్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్‌కు ఎంతో చరిత్ర ఉంది. బ్రిటీష్ పరిపాలనలో ఏర్పాటు చేసిన ఈ రైలు మార్గంలో వెళ్లే రైళ్లు, గూడ్స్ కృష్ణమ్మ కోన ప్రాంతానికి రాగానే ఆగిపోయేవి. కారణం తెలియక చాలా మంది రైల్వే అధికారులు ఈ ప్రాంతం గురించి ఆరా తీశారు. స్వయంగా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని ఆవుల కాపరి దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏవైనా దేవాలయాలు ఉన్నాయా? అని అడగటంతో సమీపంలో కృష్ణుని విగ్రహం చూపించారు. స్వామి దర్శనం చేసుకున్న రైల్వే అధికారులు ‘కృష్ణమ్మ కోన’పేరుతో రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పాటు గుడి నిర్మాణం చేపడతామన్నారు. అనుకున్న ప్రకారం బ్రిటిష్ పాలనలోకృష్ణమ్మ కోన పేరుతో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. తదనంతరం అక్కడ గుడి నిర్మాణం కూడా వారు చేపట్టారు. రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పాణ్యం, బేతంచెర్ల, నంద్యాలతో పాటు గుంటూరు, గుంతకల్ , కర్నూలు ప్రాంత భక్తులే కాకుండా బనగానపల్లె మండలం రామతీర్థం, నందివర్గం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏకాదశితోపాటు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం కందికాయపల్లె, సిమెంట్ నగర్ గ్రామాలే భక్తులే కాకుండా పాణ్యం, నంద్యాల నుంచి వచ్చిన భక్తులు భజనలు చేస్తుంటారు.
మహావిష్ణువు జగన్మోహిని
అవతారం ఇక్కడే..
కొండ కోనలు, పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న కృష్ణమ్మ కోనలో రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు వెలిసి భక్తుల చేతల పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న కథనం మేరకు.. మహావిష్ణువు జగన్మోహినిగా ఇక్కడే అవతరించారని తెలుస్తోంది. కృతయుగంలో తపస్సుతో శివుడిని మెప్పించి ఎవరిపైనా సరే తలపై చేయి పెడితే భస్మమయ్యే వరం పొందిన భస్మాసురుడే చివరకు ఇక్కడే భస్మం అయ్యారని తెలుస్తోంది. దేవతలను సైతం భస్మాసురుడు సంహరించే ప్రయత్నం చేస్తుండగా మహావిష్ణువు కృష్ణమ్మ కోన సమీపంలో జగన్మోహిని అవతారం ఎత్తి భస్మాసురుని ఆకర్షిస్తాడు. భస్మారుడు కామంతో జగన్మోహిని పొందాలనుకుంటాడు. అప్పుడు విష్ణువు కొలనులో శుద్ధిగా స్నానం చేసి రావాలనే నిబంధన పెడతాడు. కొద్దిపాటి నీరు ఉన్న కొలనులోకి భస్మాసురుడు వెళ్లి స్నానం చేస్తూ తలపైన నీళ్లు చల్లుకుంటూ చేతులు తన తలపైనే పెట్టుకోవడంతో భస్మం అవుతాడు. భస్మాసురుడిని అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తడంతోనే ఈ ప్రాంతాన్ని కృష్ణమ్మ కోనగా పిలుస్తారనే కథ ప్రాచుర్యంలో ఉంది.
రుక్మిణి సత్యభామ, సమేత శ్రీ కృష్ణుడు
కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ ప్రత్యేకం
రైల్వే అధికారులు కృష్ణుడికి గుడి, స్టేషన్
నిర్మించారని ప్రతీతి

కృష్ణుడి కోసం రైల్వే స్టేషన్!

కృష్ణుడి కోసం రైల్వే స్టేషన్!

కృష్ణుడి కోసం రైల్వే స్టేషన్!

కృష్ణుడి కోసం రైల్వే స్టేషన్!