
ఆధ్యాత్మిక గురువు శివైక్యం
ఆదోని అర్బన్: పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి దేవస్థాన ఆస్థానవాసులు, ఆధ్యాత్మిక గురువు రాజరాజేశ్వరి ఆదివారం తెల్లవారుజామున శివైక్యమయ్యారు. ఈమె1983 సంవత్సరంలో నెల్లూరు నుంచి మంత్రాలయానికి, అక్కడి నుంచి ఆదోనికి వచ్చారు.స్థానిక హనుమాన్‌నగర్‌లో ఓ చిన్న గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక, ధార్మిక చింతనతో గడుపుతూ 1987లో రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నిర్మించారు. ఆ తర్వాత పేదల కోసం కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున ఆయాసం అధికం కావడంతో ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే రాజరాజేశ్వరి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, మీనాక్షినాయుడు, ఎమ్మెల్యే డా.పార్థసారథితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం అమ్మవారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరికి గాయాలు
పాణ్యం: మండల కేంద్రం పాణ్యంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ నుంచి రాయచోటికి వెళ్తున్న కారు సాయిబాబా గుడి వద్ద పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ శివ తెల్లవారుజామున నిద్రలోకి జారుకోవడంతో జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాల య్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు కారును బయటకు తీశారు.
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం
మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల రైల్వే ఎస్‌ఐ కుమారి తెలిపిన వివరాల మేరకు గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలోని గేటు దాటిన తర్వాత ఉన్న మార్గంలో సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం గుర్తించామన్నారు. మృతి చెందిన వ్యక్తి మెడలో ఎరట్రి తాయత్తు ఉందని, నల్లటి రంగు టీ షర్టు ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
అవుకు(కొలిమిగుండ్ల): ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు అవుకు మండలంలో మెట్టుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవుకు కస్తూర్బా పాఠశాలలో పోస్టు ఇప్పిస్తామని అదే మండలానికి చెంది న ఓ మహిళతో డబ్బులు వసూలు చేశాడు. పోస్టు విషయంపై బాధితురాలు అతన్ని ప్రశ్నించడంతో జాబ్‌కు సంబంధించిన ఓ లెటర్ వాట్సాప్‌లో పెట్టి కొద్ది సేపటికే తొలగించాడు. ఈ విషయంపై ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఓ ప్రజాప్రతినిధితోపాటు, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలు అవుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మోసానికి పాల్పడిన వ్యక్తి ఓ యూట్యూబ్ చానల్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

ఆధ్యాత్మిక గురువు శివైక్యం