
రిటైర్మెంట్ బకాయిలు ఇప్పించండి
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల రిటైర్డు ఉద్యోగుల అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్‌లోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆ అసోసియేషన్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ గురుకులాల్లో రిటైర్డు అయిన ఉద్యోగులకు నేటి వరకు ఈఎల్ చెల్లించలేదన్నారు. అలాగే మెడికల్ బిల్స్‌ను మంజూరు చేయడం లేదని, ప్రభుత్వం రిలీజ్ చేసిన డీఏ అరియర్స్ కూడా చెల్లించలేదన్నారు. పీఆర్‌సీ అరియర్స్, హాఫ్‌పే లీవ్స్, వన్ మంత్ ఎర్న్‌డ్ లీవ్స్, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అరియర్స్, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ కూడా రిటైర్డు అయిన ఉద్యోగులకు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసిన అన్ని బిల్లులను ప్రభుత్వం ఆమోదించాలన్నారు. జోనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. రంగస్వామి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 450 మంది రిటైర్డు అయ్యారన్నారు. పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బుతో ఏమి చేయాలనే ప్రణాళికలు ఉద్యోగులకు ఉంటాయని, తాము దాచుకున్న సొమ్మును ఇవ్వడంలో కూడా ప్రభుత్వాలు జాప్యం చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సకాలంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందక తీవ్ర మానసిక క్షోభకు గురై పలువురు ఉద్యోగులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెక్రెటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, గురుకులాల సొసైటీ కార్యదర్శిని ప్రత్యక్షంగా కలిసి విన్నవించినా, నేటికి ఎలాంటి ఫలితం కనిపించడం లేదని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ నేతలు బాలభాస్కర్, వాసుదేవరెడ్డి, గంగాధర్, వీర ప్రసాద్, తిరుపాలయ్య, సత్యన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల రిటైర్డు ఉద్యోగుల ఆందోళన