పెద్దాసుపత్రిలో విషపురుగులు | - | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రిలో విషపురుగులు

May 28 2025 11:53 AM | Updated on May 28 2025 11:53 AM

పెద్దాసుపత్రిలో విషపురుగులు

పెద్దాసుపత్రిలో విషపురుగులు

● యథేచ్ఛగా తిరుగాడుతున్న పాములు, ఎలుకలు ● రాత్రిళ్లు దోమల బెడదతో సతమతం ● రూ.70లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం అంతంతే.. ● నిర్వహణ కంపెనీ పనితీరు నామమాత్రం ● రోగులు, సహాయకుల అవస్థలు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు మెడికల్‌ కాలేజీ, ప్రాంతీయ కంటి ప్రభుత్వ ఆసుపత్రిలలో పెస్ట్‌ కంట్రోల్‌ నిర్వహణను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు బోధనాసుపత్రిలో సైంటిఫిక్‌ శానిటేషన్‌ పాలసీ కింద దోమలు, బల్లులు, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, పాములు, ఇతర విషకీటకాల నివారణకు వాడే పెస్టిసైడ్స్‌ను మధ్యాహ్నం వరకు హెల్త్‌ సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఎలుకలు, పాములు ఉంటే వాటిని పట్టుకుని సంహరించాలి. ఈ మేరకు నిర్వహణకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు రూ.5లక్షలు, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో రూ.30వేలు, మెడికల్‌ కాలేజిలో మరో రూ.30 వేలు కలిపి నెలకు రూ.5.90లక్షలు, ఏడాదికి రూ.70,80,000 వెచ్చిస్తున్నారు. నిర్వహణ సంస్థలో పది మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆరుగురితో మమ అనిపిస్తుండటం వల్లే విష పురుగులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయని తెలుస్తోంది.

పట్టపగలే ఎలుకలు, పాముల సంచారం

ఆసుపత్రి, కళాశాల ఆవరణలో రాత్రేమో గానీ ఖాళీ ప్రదేశాల్లో పట్టపగలే ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి బయటకు వచ్చి వార్డులు, కార్యాలయ గదుల్లోకి దూరుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్‌ గైనిక్‌ విభాగం, శక్తిసదన్‌, కంటి ఆసుపత్రిలోని ఖాళీ ప్రదేశాలు, డైట్‌ విభాగం, దాని పక్కనున్న ఖాళీ ప్రదేశాలు, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంతం, సూపర్‌స్పెషాలిటి విభాగం పక్కనున్న ఖాళీ ప్రదేశం, ఐడీ వార్డు, మానసిక వ్యాధుల విభాగం, యుపీ, పీజీ హాస్టల్స్‌ పరిసరాలు పాములకు నిలయాలుగా మారాయి. ఆయా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మొక్కలు ఏపుగా పెరగడంతో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి. వీటిని తినేందుకు పాములు వస్తున్నాయి. స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద ఇటీవల నిరుపయోగంగా ఉన్న ఇనుప సామాను అంతా కుప్పపోసి ఉంచారు. వాటిని టెండర్‌ పాడిన వారు తీసుకెళ్లకపోవడంతో ఆ ప్రాంతంల్లో పాముల సంచారం అధికంగా ఉంటోందని రోగుల సహాయకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల బంధువులు ఆరుబయట భోజనం చేసి, అక్కడే చేతులు కడుక్కోవడంతో మిగిలిపోయిన ఆహారాన్ని తినేందుకు ఎలుకలు, బొద్దింకలు అధికంగా పుట్టుకొస్తున్నాయి.

చీకటి పడితే చాలు దోమల బెడద

బోధనాసుపత్రిలో రోజూ సాయంత్రం అయితే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. వాటి బారి నుంచి రక్షణ పొందేందుకు రోగులు, వారి సహాయకులు మస్కిటో కాయిల్స్‌, లిక్విడ్స్‌ వాడుతున్నారు. అన్ని విభాగాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది.

తూతూ మంత్రంగా పెస్ట్‌కంట్రోల్‌ నిర్వహణ

ఆసుపత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ నిర్వహణ తూతూ మంత్రంగా జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్ర మే సంబంధిత ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాములు, ఎలుకలు, పందికొక్కులు తిరిగే చోటును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. వీరి పనితీరును బట్టి అధికారులు మార్కులు వేయాల్సి ఉంటుంది. పనితీరు సరిగ్గా లేకపోవడంతోనే ఇటీవల మూడు నెలలుగా బిల్లులకు ఆసుపత్రి అధికారులు బ్రేక్‌ వేశారు. టెండర్‌ కాలపరిమితి ముగియడంతో అధికారుల చర్యలకు సైతం కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement