
నేటితో ముగియనున్న సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని 69 కేంద్రాల్లో జరుగుతున్న పది సప్లమెంటరీ పరీక్షలు నేటి(మంగళవారం)తో ముగియనున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 1265 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 4962 మంది విద్యార్థులకుగాను 3697 మంది హాజరైయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మొత్తం 13 కేంద్రాలను తనిఖీ చేశారు.
వృద్ధుడి
ప్రాణం తీసిన కరెంట్
ఆదోని అర్బన్: మంచినీళ్ల కోసం మోటార్‌ను ఆన్ చేస్తూ ఓ వృద్ధుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ దుర్ఘటన విరుపాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ గొల్ల ముద్దయ్య(60) అనే వృద్ధుడు జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రాగమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉదయం మంచినీరు వస్తున్నాయని తెలుసుకుని గొల్ల ముద్దయ్య మోటార్ ఆన్ చేస్తూ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్విచ్ ఆన్‌లో ఉన్నా కూడా ప్లగ్‌ను పెట్టబోయాడని, దీంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
వెలుగోడు: బోయరేవుల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శాబోలు నరసింహుడు (70) మృతి చెందాడు. ఏఎస్‌ఐ హుస్సేన్ వివరాల మేరకు.. బోయరేవుల గ్రామానికి చెందిన శాబోలు నరసింహుడు బోయరేవుల బస్ స్టాండ్ వద్ద రోడ్డుకు ఎడమ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా డ్రైవర్ జంబి రాజేంద్ర కారును అతివేగంగా నడుపుతూ వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసింహుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ హుస్సేన్ తెలిపారు.
పోలీసులు లేక..
వేలం పాటలు వాయిదా
శిరివెళ్ల: మండలంలోని గుండంపాడు, శిరివెళ్లలోని ఆలయాల మాన్యం భూముల కౌలు బహిరంగ వేలం పాటలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన మేరకు ఈనెల 26వ తేది వేలం పాట జరగాల్సి ఉంది. అయితే కడపలో జరిగే మహానాడుకు స్థానిక పోలీసులు బందోబస్తు విధులకు వెళ్లారు. దీంతో వేలం పాట నిర్వహణకు పోలీసులు రాలేని పరిస్థితి ఉందని ఎస్‌ఐ చిన్న పీరయ్య పేర్కొనడంతో ఆయన సూచన మేరకు జూన్ 4వ తేదీకి వేలం పాటలు వాయిదా వేశామని ఆయల ఈఓ రామాంజనేయ శర్మ తెలిపారు. ఈ మార్పును రైతులు గమనించాలని సోమవారం ఓ ప్రకటనలో కోరారు.
రోడ్డు ప్రమాదంలో
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని డోన్ హైవేలో మానస ఢాబా ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 91211 01063 లేదా 91211 01064 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు విజ్ఞప్తి చేశారు.