
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది అన్నారు. బుధవారం జిల్లా న్యాయసదన్‌లో న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, ఐసీడీఎస్ పీడీ నిర్మల, కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డీసీబీ సెక్రటీ నాగరాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదాబేగం తదితరులు కర్నూలు నగరంలో బాల కార్మికులను గుర్తించేందుకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీని జిల్లా న్యాయ సేవాసదన్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కబర్ది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాల కార్మికులను గుర్తించి బడికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలలతో పనిచేయించడం నేరమని, ఇందుకు రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయన్నారు. అనంతరం రాజ్‌విహార్, పాతబస్టాండ్, పెద్ద మార్కెట్, ఆనంద్ థియేటర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఐదుగురు బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.