శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 27వ తేదీ నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే మహోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తారు. అలాగే కన్నుల పండువగా గ్రామోత్సవం సైతం నిర్వహించనున్నారు. ఉగాది మహోత్సవాల్లో వీరాచారా విన్యాసాలు, పంచాంగ శ్రవణం, స్వామి అమ్మవార్లకు రథోత్సవం తదితర కార్యక్రమాలు ప్రధానమైనవి. కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించారు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో, 10 రోజులపాటు కన్నడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశారు. మహోత్సవాలను పురస్కరించుకుని కన్నడిగుల సౌకర్యార్థం, శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను యథావిధిగా ఉగాది మహోత్సవాలకు అమలు చేస్తోంది. క్షేత్ర పరిధిలో తాత్కాలిక వసతి కోసం పలు ఉద్యానవనాల్లో, ఖాళీ ప్రదేశాలలో షామియానాల ఏర్పాటు చేసింది. భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనంతో పాటు మల్లన్న స్పర్శ రూ.500 టికెట్ కౌంటర్ సైతం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భక్తులు దేవస్థానానికి సహకరించేలా శ్రీశైల జగద్గురు పీఠాధిపతి వారి ప్రసంగ వీడియోని ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రసారం చేస్తున్నామన్నారు.
శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్న కన్నడ భక్తులు
భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం