● వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
కోడుమూరు రూరల్: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో నుంచి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తొలగించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం కోడుమూరు వెళ్లారు. మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడిన వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ‘కూటమి’ నేతలు హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైఎస్సార్ విగ్రహాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. యూనివర్సిటీలకు వైఎస్సార్ పేరు ఉండగా మార్చడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఒకే వ్యక్తిపై పలు జిల్లాల్లో ఒకే విధమైన కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది అనాగరిక చర్య అన్నారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్‌లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్‌పీటీసీ సభ్యుడు రఘునాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్‌రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల అధ్యక్షుడు రమేష్‌నాయుడు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్‌కుమార్, స్థానిక నాయకులు జగదీష్, గోపి, విజయభాస్కరరెడ్డి, బందె నవాజ్, డీజె రాజు, బజారి, వెంకటేశ్వర్లు, ఈరన్న, మాసుమ్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.