కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి చెక్కబొమ్మలతో పాటు కళాకారులకు మెరుగైన ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించి పూర్వవైభవం తీసుకొస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) కింద ఇటీవల కొండపల్లి బొమ్మల పునరుజ్జీవనం ప్రోత్సాహానికి రూ.20లక్షలకు ఆమోదం లభించడం కీలక ముందడుగన్నారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ను బుధవారం కలెక్టర్ సందర్శించారు. బొమ్మల తయారీ ప్రక్రియ, కళాకారుల నైపుణ్యాలు, సంప్రదాయ కళ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రాజెక్టు ద్వారా 420మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. సంప్రదాయ కళను పరిరక్షణ, కళాకారుల నైపుణ్యాలు, ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పర్యావరణహిత ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ విక్రయాలు, మెరుగైన మార్కెట్ అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు కల్పించి కళాకారుల ఆదాయాన్ని పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


