చిలకలపూడి(మచిలీపట్నం): రెండో దశ జనగణనకు సంబంధించి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చే ఫీల్డ్ ట్రైనర్లు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని, ప్రాక్టి కల్‌గా బోధించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన భారత జనాభా లెక్కలు–2027 ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. సిద్ధాంతపరమైన వివరణలకే పరిమితం కాకుండా, యాప్ వినియోగం, వివరాల నమోదు తదితర అంశాలను ప్రాక్టికల్‌గా చేసి చూపించాలన్నారు. విధి నిర్వహ ణలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి శిక్షణ కార్యక్రమం చివర ప్రత్యేకంగా సందేహ నివృత్తికి అవకాశం కల్పించాలన్నారు. జనగణన మొదటి దశలో భవనాలు, గృహాల వివరాలు సేకరించామన్నారు. రెండో దశలో ప్రతి ఇంటిలో నివసించే వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి నమోదు చేస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే మ్యాపింగ్ చేసిన గృహాలను ఆధారంగా చేసుకుని జనాభా వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం రెండో బ్యాచ్ ఫీల్డ్ ట్రైనర్లకు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు సంబంధిత మండలాల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. జనగణనలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. రెండో దశలో కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ జనవరిలో ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగుతుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, ట్రైనర్లు తదిత రులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


