అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక వాంబే కాలనీలో గురువారం క్షుద్రపూజల కలకలం రేగింది. స్థానికుల కథనం మేరకు.. వాంబేకాలనీ రోడ్డులోని ఎక్సెల్‌ప్లాంట్ వెంబడి ఉన్న జీ ప్లస్ త్రీ అపార్ట్‌మెంట్‌లోని 79వ బ్లాకులోని ఓ ఇంటి ఆవరణలో ఆరడుగుల మేర గొయ్యి తవ్వి ఉండడం, ఆ ఇంటిలో నుంచి పూజలు చేస్తున్నట్లు శబ్దం వినిపించడంతో కొందరు వ్యక్తులు ఆ ఇంటిలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ అనుమానం వ్యక్తంచేశారు. ఈ పుకార్లు ఒక్కసారిగా కాలనీ అంతా పాకడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఆ ఇంటి వారు ఆ గొయ్యిని పూడ్చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆ ఇంటికి చెందిన దుర్గారావు శివ మాల వేసుకొని ఉన్నాడని, అతను ఇంటిలో మరుగుదొడ్డి నిమిత్తం వరలు వేసుకోవడం కోసం గొయ్యి తవ్వినట్లుగా తేలింది. అయితే స్థానికులు కొందరు ఆ ఇంటిలో విచిత్రమైన మంత్రాలు వినిపిస్తున్నాయని, దిష్టి బొమ్మ, నిమ్మకాయలు, వెంట్రుకలు ఉన్నాయంటూ ఆరోపించారు. పోలీసులు మళ్లీ పూడ్చిన గొయ్యిని తవ్వించారు. అటువంటివి ఏవీ అందులో లేకపోవడంతో ఆ కుటుంబం అంటే గిట్టని కొందరు ఇలా దుష్ప్రచారం చేశారని భావించి స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ ప్రత్యేక బీట్లు ఏర్పాటుచేశారు. తాను, తన భార్య కూలిపనులు చేసుకుంటామని, శివ మాల ధరించిన తాను రోజూ ఇంటి పక్కన ఉన్న గదిలోనే స్నానం చేసి, పూజలు చేసుకుంటానని ఇంటి యజమాని దుర్గారావు తెలిపారు. మరుగుదొడ్డి కోసం వరలు వేద్దామని తవ్విన గొయ్యిపై కొంతమంది కావాలనే ఇంత రాద్దాంతం చేశారని, తమ ఇంటిలోని పిల్లలు, మహిళలు ఏడుస్తున్నా కనికరం లేకుండా మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.


