గుడివాడ టౌన్: గుడివాడ పట్టణంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, మునిసిపల్ మాజీ కౌన్సిలర్ నెరుసు చింతయ్య సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పార్టీ కండువా కప్పి చింతయ్యను పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ నేపథ్యం కలిగిన నెరుసు చింతయ్య అప్పటి కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి 980 పైచిలుకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచి రాష్ట్ర రికార్డు సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు పర్యాయాలు మునిసిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన చింతయ్య ప్రస్తుత టీడీపీ నాయకుల తీరు నచ్చక మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు.
టీడీపీలో రూ. 25 లక్షలు ఇస్తేనే టికెట్..
తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్ టికెట్ కావాలంటే రూ. 25లక్షలు చెల్లించాలంటూ బేరం పెడుతున్నారని చింతయ్య ఆరోపించారు. డబ్బుంటే స్థానికులకే కాదు విదేశీ వ్యక్తులకై నా టికెట్ ఇస్తామని టీడీపీ ముఖ్యనేతలు అనడం తనకు ఆవేదన కలిగించిందన్నారు. కొడాలి నానీతో కలిసి పనిచెయ్యడంతో పాటు తనకు గల రాజకీయ పరిచయాలను పార్టీ సేవలకు వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు. నెరుసు శేషగిరిరావు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన నెరుసు కుటుంబం


