తిరుపతమ్మ ఆలయంలో భక్తుల కోలాహలం | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ ఆలయంలో భక్తుల కోలాహలం

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

తిరుపతమ్మ ఆలయంలో భక్తుల కోలాహలం గుర్తు తెలియని వ్యక్తుల మృతి తిరువూరు ప్రైవేట్‌ నర్సింగ్‌హోంలో బాలింత మృతి అమృతతుల్యమైన భాష తెలుగు

పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారు కార్తిక మాస ప్రత్యేక అలంకరణల్లో భాగంగా ఆదివారం వివిధ రకాల పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తిక మాసం, ఆదివారం సెలవు రోజు కావటంతో భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించికుని పాలు పొంగళ్లతో బోనాలు చెల్లించి మొక్కుబడులు తీర్చుకున్నారు. పూల అలంకరణకు గ్రామానికి చెందిన వైపీఆర్‌ గార్డెన్స్‌ వారు సహకారం అందజేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నూతక్కి వెంకటసాంబశివరావు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పామర్రు: గుర్తు తెలియని వృద్ధుడు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సంఘటన పామర్రు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామర్రు మండల పరిధి కొత్త పెదమద్దాలిలో ఈనెల 11న జాతీయ రహదారి–65 పక్కన సుమారు 65 నుంచి 75 ఏళ్ల గుర్తు తెలియని మగ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు పామర్రు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు ఆ వృద్ధుడిని చికిత్స నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పామర్రు పోలీస్‌ స్టేషన్‌ను లేదా 94407 96431 నంబర్‌కు సంప్రదించాలని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

కొత్త ప్రభుత్వాస్పత్రిలో..

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొత్త ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. పాత గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వద్ద శనివారం రాత్రి బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి పడిపోయాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతుని ఊరు, పేరు పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

తిరువూరు: స్థానిక బోస్‌ సెంటర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో ఆదివారం తెల్లవారుజామున బాలింత మృతి చెందిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. విస్సన్నపేట మండలం నూతిపాడుకు చెందిన మన్నెం నాగలక్ష్మి(22)ని డెలివరీ నిమిత్తం తిరువూరులోని ప్రైవేటు నర్సింగ్‌ హోంలో బుధవారం కుటుంబ సభ్యులు చేర్పించారు. శస్త్రచికిత్స అనంతరం ఆడ పిల్లకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులను సంప్రదించగా, ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని శనివారం రాత్రి సూచించారు. ఆస్పత్రి సిబ్బంది ఎటువంటి మెడికల్‌ రిపోర్టులు ఇవ్వకుండా డిశ్చార్జి చేయడానికి యత్నిస్తుండగానే నాగలక్ష్మి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగలక్ష్మి మృతి చెందిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు ఆస్ప త్రి ఎదుట బైఠాయించారు. పోలీసులు వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు.

విజయవాడ కల్చరల్‌: అమృతతుల్యమైన భాష తెలుగు అని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బరావు అన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహణలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బందరురోడ్డులోని ఠాగూర్‌ గ్రంథాలయంలో ఆదివారం కవి సమ్మేళనం, మాచర్ల పెద్ద జాను కవికి అచ్చతెలుగు కవి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు అతి ప్రాచీన భాష అన్నారు. ప్రాథమిక స్థాయిలో తెలుగులో బోధన సాగాలని సూచించారు. భాషా వేత్త పీజీటీవీ రంగాచార్యులు, తెలుగు భాషా పరిశోధకులు డాక్టర్‌ లగడపాటి సంగయ్య, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, డాక్టర్‌ కావూరి సత్యవతిలు అచ్చతెలుగు కొత్త కదలిక అంశంగా ప్రసంగించారు. రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్‌ ఆధ్వర్యంలో తెలుగు మాటల వాడకమే తెలుగుకు కావాలి అంశంగా కవి సమ్మేళనం నిర్వహించారు. సుధారాణి, చింతా లక్ష్మీ సుజాత తదితరులు స్వీయ కవితా గానం చేశారు. కవి మాచర్ల పెద్ద జాను కవికి అచ్చ తెలుగు కవితా సత్కారం చేశారు. ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ వైఎస్‌ బాబు, ఠాగూర్‌ గ్రంథాలయ అధికారి రమాదేవిపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement