జడ్జి కారును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం | - | Sakshi
Sakshi News home page

జడ్జి కారును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

జడ్జి కారును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ఆస్తి వివాదాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సేకరించాలి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు డ్రగ్స్‌ కేసు ఉందంటూ బెదిరించి డబ్బులు కాజేశారు!

లబ్బీపేట(విజయవాడతూర్పు): సివిల్‌ కోర్టులో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న న్యాయమూర్తి కారును ద్విచక్ర వాహనం డీకొట్టిన ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం గుణదల షిర్డీసాయి నగర్‌లో నివసించే చిట్టిపోతుల రామకోటేశ్వరరావు ఓ న్యాయమూర్తి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. గత నెల 29న న్యాయమూర్తి విధులు ముగిసిన తర్వాత కారులో ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి ఒక ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు బంపర్‌ డ్యామేజీ అయింది. కారు డ్రైవర్‌ రామకోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

గన్నవరం: ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... మండలంలోని ముస్తాబాద గ్రామానికి చెందిన ముద్రబోయిన ఆంజనేయులుతో రజనికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక ఆడపిల్ల సంతానం. అయితే ఆంజనేయులుకు విజయవాడలో ఉంటున్న అతని తల్లిదండ్రులు, అన్న, వదినతో ఆస్తి విషయమై కొంతకాలంగా వివాదాలు నడుస్తూ, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ తగాదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన రజని గురువారం ఉదయం తన భర్త పనులకు వెళ్లిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై మృతురాలి తల్లి మిండాల దుర్గ ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం కుటుంబ ఆస్తి గొడవల కారణంగా తన కుమార్తె మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌

చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలకు లోబడి ధాన్యాన్ని సేకరించాలని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్‌ డీలర్లు, పీడీఎస్‌ డీటీలతో గురువారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేసీ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రైస్‌మిల్లర్లు, ధాన్యం సేకరణ విషయంలో అధికారులకు సహకరించాలని, బ్యాంకు గ్యారెంటీలు, గోనెసంచులు, రవాణా వంటి అంశాల్లో ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించే విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. రైతుబజార్లలో ధరణి బియ్యం విక్రయాలను సక్రమంగా నిర్వహించాలని, బియ్యం నిల్వలను నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం అధిక ధరలకు అమ్ముతున్న నేపథ్యంలో సరసమైన ధరలకు రైతుబజార్లలోని కౌంటర్లలో అమ్మకాలు జరుపుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పి.శివరామప్రసాద్‌, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి రోజారమణి తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం:కుటుంబ సమస్యల నేపథ్యంలో మనస్తాపానికి గురై కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళను ఇబ్రహీంపట్నం పోలీసులు కాపాడిన ఘటన గురువారం జరి గింది. కొండపల్లి కొత్తగేటు ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఎన్టీటీపీఎస్‌ కాలువలోకి దూకడానికి యత్నిస్తున్న విషయం గుర్తించిన వాహనదారులు 112 నంబర్‌కు ఫోన్‌చేసి కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సీఐ ఎం.వి.దుర్గారావు వెంటనే ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రమణ్యంకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహిళను గుర్తించి రక్షించారు. అనంతరం మహిళకు ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. మహిళ ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సీఐ ఎం.వి.దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బందిని సీపీ ఎస్‌.వి.రాజశేఖర బాబు అభినందించారు.

పాయకాపురం(విజయవాడరూరల్‌): మీపై డ్రగ్స్‌ కేసు ఉందని, డబ్బులు చెల్లించకపోతే అరెస్ట్‌ చేస్తామని ఆన్‌లైన్‌ వీడియో కాల్‌ చేసి బెదిరించి డబ్బులు కాజేసినట్లు నున్న పోలీసు స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పైపులరోడ్డు డిస్నీల్యాండ్‌కు వెళ్లే రోడ్డులో కిరాణా షాపు నడుపుతున్న రవీంద్రరావు(52)ను గుర్తు తెలియని వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి మీపై డ్రగ్స్‌ కేసు ఉందని, డబ్బులు చెల్లించకపోతే అరెస్ట్‌ చేస్తామని భయపెట్టి విడతల వారీగా లక్షా 35వేల రూపాయలను ఫోన్‌ పే ద్వారా వేయించుకుని మోసం చేశారని బాధితుని భార్య శ్రీరామ రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement