డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రావణ్‌బాబు
కృష్ణలంక(విజయవాడతూర్పు): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాలని, మితిమీరిన వైద్యం చేయరాదని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ కొంతమంది ఆర్‌ఎంపీలు పరిధి దాటి హై యాంటీబయాటిక్ మందులను విరివిగా వాడుతున్నారని, అంతేకాకుండా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు వాడే మెరోపెనెమ్ వంటి ఇంజక్షన్లను సైతం వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలను సంఘ నాయకులు తక్షణమే కట్టడి చేయాలని ఆదేశించారు. ఏపీ జేఏసీ గౌరవ సలహాదారుడు లంక దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ ఆర్‌ఎంపీలకు చట్టబద్ధత కల్పించేందుకు జేఏసీ తరఫున తీవ్ర కృషి చేస్తున్నామన్నారు. అయితే ఆర్‌ఎంపీలు అందించే ప్రాథమిక వైద్యం అధికారులకు ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదని సూచించారు. రిటైర్డ్ డీఎంహెచ్‌వో ఎ.కొండలరావు మాట్లాడుతూ ప్రజల్లో ఆర్‌ఎంపీలపై ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే పరిమిత వైద్యం మాత్రమే చేయాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కందుల రాము, డాక్టర్ తోటకూర ప్రణీత చౌదరి ఆర్‌ఎంపీలకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంపీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యామర్తి నాగేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నండూరి ఉమాశంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుట్టం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాగిరాజు ఉదయ భాస్కర్‌రాజు, సలహా మండలి చైర్మన్ కోలా వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పుట్టా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


