● ఉయ్యూరు మండలంలో
అధికార పార్టీ నేతల రుబాబు
● పెద ఓగిరాలలో ఉద్రిక్తత
● కూటమి వారిని వదిలి వైఎస్సార్ సీపీ
వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన వైనం
● కాటూరు 1 సెగ్మెంట్‌లో
విచ్చలవిడిగా డబ్బు పంపిణీ
ఉయ్యూరు: జిల్లా పరిషత్, మండల ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో అధికార బలం, డబ్బు ప్రవాహం, పోలీసులతో బెదిరింపుల మధ్య పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఉయ్యూరు మండలంలో పోలింగ్ జరిగిన తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కూటమి నేతలు, కార్యకర్తలు పోలింగ్ బూత్‌లు, కేంద్రాల సమీపంలో యథేచ్ఛగా ప్రచారం చేస్తున్నా పట్టించుకోని పోలీసులు, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆ సమీపానికి వస్తేనే దూరంగా వెళ్లిపోవాలని తరిమేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇతర ప్రాంతాలకు చెందిన కూటమి పార్టీల నేతలు సైతం యథేచ్ఛగా బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేశారు.
పెద ఓగిరాలలో తోపులాట
ఉయ్యూరు మండలం పెద ఓగిరాలలో టీడీపీ నేతలు చాగంటి పోతిరెడ్డి, ప్రసాదరెడ్డి, పెరుమాళ్ల ఏసుబాబు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బూత్‌ల వద్దే ఉంటూ ఓటర్లను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. వారి విషయం పలుమార్లు వైఎస్సార్ సీపీ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టీడీపీ నేతలు బూత్‌ల వద్దే ఉండటంతో వైఎస్సార్ సీపీ నేతలు అక్కడకు వెళ్లి పోలింగ్ కేంద్రం లోపలకు ఎందుకు వెళ్తున్నారని వారిని ప్రశ్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కూటమి నేత ఏసుబాబు కింద పడగా తలకు గాయమై రక్తం వచ్చింది. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారంటూ అసత్య ప్రచారం మొదలు పెట్టారు. కూటమి నేతల ఆదేశాలతో పలువురు వైఎస్సార్ సీపీ నేతలను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కాటూరు 1 సెగ్మెంట్‌లో డబ్బు ప్రవాహం
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం కాటూరు 1లో డబ్బు ప్రవాహం సాగింది. అక్కడ టీడీపీ తరఫున ఎంపీపీ రేసులో ఉన్న వేమూరి శ్రీనివాసరావు, అదే పార్టీ రెబల్‌గా పోటీలో ఆళ్ల శ్రీకాంత్ డబ్బు ప్రవాహం పారించారు. ఒక్కొక్కరు ఓటుకు రూ.2 వేలు చొప్పున ఇవ్వగా, గురువారం మధ్యాహ్నం వరకూ ఓటు వేసేందుకు రాని వారికి మరో రూ.500 చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. మండలంలోని ఆకునూరు, చిన ఓగిరాల, కలవపాముల, బోళ్లపాడు గ్రామాల్లో పోలింగ్ పేలవంగా సాగింది. పలు చోట్ల కూటమి నేతలు ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేసుకున్నారు.


