పోలింగ్‌ సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

● అధికారులకు కలెక్టర్‌

డీకే బాలాజీ ఆదేశం

● రిసెప్షన్‌ కేంద్రంలో

వసతుల పరిశీలన

కోనేరుసెంటర్‌: జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ అనంతరం కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సామగ్రిని భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం రిసెప్షన్‌ కేంద్రాన్ని సందర్శించి అక్కడ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బంది కౌంటింగ్‌ సెంటర్‌లోకి వెళ్లే మార్గాలు, పోలింగ్‌ సామగ్రిని అప్పగించే విధానం, వాటిని స్వీకరించే కౌంటర్లు, సిబ్బంది విధుల నిర్వహణకు కేటాయించిన ప్రాంతాలు, సామగ్రిని భద్రపరిచే ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా రిసెప్షన్‌ కేంద్రానికి చేరుకునేలా స్పష్టమైన లేఅవుట్‌ రూపొందించాలని, ప్రతి దశలోనూ క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాలని సూచించారు. బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని సంబంధిత సిబ్బంది నుంచి జాగ్రత్తగా స్వీకరించి, నిర్దేశించిన విధానాల ప్రకారం రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. సామగ్రి స్వీకరణ, పరిశీలన, అప్పగింత ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రిసెప్షన్‌ కేంద్రాల్లో సిబ్బందికి తగిన కౌంటర్లు, తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌ తదితర మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. అధికారులు, పోలింగ్‌ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన భోజన వసతులను స్వయంగా పరిశీలించారు. భోజనం పంపిణీకి అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేశారా లేదా, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో భోజనం అందించేలా ఏర్పాట్లు ఉన్నాయా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భోజనాల కోసం అవసరమైతే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి, రద్దీ లేకుండా, వేచి ఉండే పరిస్థితులు తలెత్తకుండా ఆహార పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, ఎన్నికల సామగ్రి స్వీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎల్డీవోలు, రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌వోలు సత్యవతి, నగేష్‌, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement