పేదలపైకి కూటమి బుల్డోజర్లు! | - | Sakshi
Sakshi News home page

పేదలపైకి కూటమి బుల్డోజర్లు!

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

రెండున్నరేళ్లుగా యథేచ్ఛగా విధ్వంస పాలన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల గృహాలు ధ్వంసం..

బందరులో కక్షగట్టి కూల్చివేతలు చితికిపోయిన చిరు వ్యాపారులు నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలు తగిన బుద్ధి చెప్పేందుకు చూస్తున్న బాధితులు

రెండున్నరేళ్లుగా యథేచ్ఛగా విధ్వంస పాలన

మచిలీపట్నంటౌన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో మచిలీపట్నం నగరంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసింది. వైఎస్సార్‌ సీపీ పాలనలో ఎన్నో మేలులు పొందిన పేదలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేసింది. నిరుపేదలనే విచక్షణ లేకుండా ధ్వంస రచన చేసింది. కక్ష సాధింపులతో అధికార దర్పాన్ని ప్రదర్శించింది. ఈ చర్యలతో నగరంలోని ఎంతోమంది పేదలు చిరు వ్యాపారులు కూటమి పాలనపై విసుగు చెంది వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమయ్యారు.

200 పేదల గృహాలు ధ్వంసం..

కూటమి పాలన ప్రారంభమైన తర్వాత రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో మునిసిపల్‌ అధికారులు నగరంలో కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారు. మూడు స్తంభాల సెంటర్‌ సమీపంలోని జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌ దిగువన శివగంగ డ్రెయిన్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతానికి చెందిన దాదాపు 200 మంది నిరుపేదలు సెంటు స్థలంలో రేకుల షెడ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. దీంతో కక్ష కట్టిన కూటమి పాలకులు అధికారం చేపట్టిన తర్వా త ఇక్కడి వాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండా గతేడాది సెప్టెంబర్‌ 24వ తేదీ తెల్లవారుజామునే వందలాది మంది పోలీసుల పహారా నడుమ పొక్లయిన్లతో రేకులతో నిర్మించిన గృహాలను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. అక్కడ జీవిస్తున్న పేదలకు వేరే ప్రాంతంలో స్థలం చూపి పక్కా గృహాలు నిర్మించని కూటమి పాలకులు నిర్ధాక్షిణ్యంగా పేదల గృహాలను ధ్వంసం చేశారు. దీంతో నిరాశ్రయులైన కొందరు పేదలు ఊరు వదిలి వెళ్లిపోయారు. మరికొందరు అద్దె గృహాల్లో ఉంటున్నారు. కానీ ఎప్పటి వరకు వారికి స్థలం ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించలేదు.

ఫుడ్‌ కోర్ట్‌ తొలగింపు..

నగరంలోని చిరు వ్యాపారస్తుల జీవనోపాధి కోసం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ వెనక వైపున ఉన్న రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారులు ఫుడ్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగర ప్రజలకు ఇక్కడ అల్పాహారం లభించేది. ఈ ఫుడ్‌ కోర్ట్‌తో ఎంతోమంది చిరు వ్యాపారస్తులు ఉపాధి పొందుతున్నారు. అధికారం చేపట్టిన కూటమికి ఫుడ్‌ కోర్టుపై కన్ను పడి దీన్ని కూడా తొలగించారు.

డ్రెయిన్ల అభివృద్ధి పేరుతో..

నగరంలో డ్రెయిన్‌లను అభివృద్ధి చేస్తాం అనే పేరుతో కూటమి పాలకులు రోడ్ల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల బడ్డీ కొట్లను, దుకాణాలను తొలగించారు. దీంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. మచిలీపట్నంలో ఉపాధికి అవకాశాలు లేకపోవడంతో వారిలో ఎక్కువమంది ఇతర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్లారు. కూటమి పాలకుల అనుయాయులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో బడ్డీలను యథేచ్ఛగా ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నా.. నగరపాలక సంస్థ అధికారులకు కనపడటం లేదు.

కూటమి పాలకులు అధికారం చేపట్టిన తొలినాళ్లలో నగరంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీ చెందిన కార్యకర్తలపైన దాడులు, గృహాల ధ్వంసం వంటి పనులకు పూనుకున్నారు. నగరంలోని కాసానిగూడెం ప్రాంతంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గృహాన్ని ధ్వంసం చేసి ఇంట్లోని సామాన్లను చెల్లాచెదురు చేశారు. వ్యక్తులపై భౌతిక దాడులకు దిగారు. అలాగే చిలకలపూడిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై దాడులు చేసి గృహంలోని సామగ్రిని చల్లాచెదురుచేసి, గృహాన్ని తొలగించారు. ఈ విధ్వంసకర పాలనను గమనిస్తున్న నగర ప్రజలు, బాధితులు కూటమి పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సంసిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement