గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నో దశాబ్దాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీఓ సంఘం కృషి చేస్తోందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్ తెలిపారు. పెన్షనర్ల వయస్సు, ఆరోగ్య అవసరాలు, ఆర్థిక, సాంకేతిక సమస్యలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్యసేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ సిటిజన్లకు నాణ్యమైన వైద్యసేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, సంఘ ప్రధాన కార్యదర్శి జె. రాజారావు, ఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు.


