ఆ నాయకుడి అక్రమాలు శ్మశాన భూమి విక్రయం, వాటర్‌ప్లాంట్‌కే పరిమితం కాలేదు అక్రమంగా మట్టి దందా కూడా సాగించాడు. గ్రామంలోని పురాతన తాళ్ల చెరువు అభివృద్ధి పేరిట ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలించేశాడు. చెరువు మట్టిని తవ్వి తరలించాలంటే మైనింగ్, పంచాయతీ రాజ్ శాఖ అనుమతులు కచ్చితంగా తీసుకోవాలి. పంచాయతీకి చెందిన చెరువు మట్టిని గ్రామంలోని రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ కార్యాలయాల మెరక పనులకు ఉపయోగించాలి. అయితే ఆ టీడీపీ నాయకుడు అడ్డగోలుగా మట్టిని అమ్మేసుకున్నాడు. గుడివాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు ట్రాక్టర్ ట్రక్కు రూ.1500 నుంచి రూ.2 వేల చొప్పున విక్రయించాడు. గ్రామంలో పలు అంతర్గత రహదారులు పల్లంగా ఉన్నా ఒక్క ట్రక్కు మట్టి కూడా తోలకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులకు అడ్డగోలుగా అమ్మేసి రూ.25 లక్షలు దండుకున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తాళ్ల చెరువులో చేపల పట్టుబడికి రూ.63 వేలకు పాట పెడితే, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వలో రూ.53 వేలకే పాట ఖరారుచేశారు. పంచాయతీ నిబంధనల మేరకు గతంలో కంటే పాట ఎక్కువ మొత్తం పలకాలి, తక్కువకే పాటదారులకు అప్పగించడం వెనుక ఆ టీడీపీ నాయకుడి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.


