భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్ గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించామని, అయినా అప్రమత్తంగా ఉవడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలో భాగంగా ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం గొల్లపూడి పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ల గోడౌన్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరుతోపాటు అగ్నిమాపక, విద్యుత్ పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరుస్తున్న గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. డీఆర్వో లక్ష్మీనరసింహం, యేదుపాటి రామయ్య(టీడీపీ), మురళీకృష్ణ(ఐఎన్‌సీ) జడగం శ్రీనివాసరావు (జనసేన), సురేష్(సీపీఎం) తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం: ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఉచిత వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 90 రోజుల కాల పరిమితి కలిగిన ఎలక్ట్రీషియన్, సోలార్ మెకానిక్, ఏసీ మెకానిజంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్మీడియెట్, ఐటీఐ పూర్తిచేసిన 18 నుంచి 40 ఏళ్ల వయసున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులకు పూర్తి ఉచితంగా నైపుణ్య శిక్షణ, భోజన, హాస్టల్ వసతి, ల్యాబ్ సౌకర్యం, శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆధార్‌కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్‌లు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర సమాచారానికి 96664 22627, 83090 31720, 94927 87399 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని శారద కళాశాలలో ఈ నెల 26వ తేదీ సోమవారం జరిగిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల చెస్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు వర్సిటీ స్థాయి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి చెప్పారు. కళాశాలలో మంగళవారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థులు పి.జ్యోతి కిరణ్, బి.అభిరామ్, సీహెచ్ కౌశిక్, ఎస్‌కే అల్తాఫ్, బీజేఎస్‌కే రణధీర్, పి.జ్యోతి స్వరూప్ తేజ ఉత్తమ ప్రతిభతో విజేతలుగా నిలిచారన్నారు. కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు మాట్లాడుతూ త్వరలో ఆదిత్య డీమ్డ్ యూనివర్సిటీ ఏపీలో జరగబోయే దక్షిణ భారత పురుషుల చెస్ చాంపియన్‌షిప్‌నకు కృష్ణా యూనివర్సిటీ తరఫున వీరు ఎంపికైనట్లు చెప్పారు. విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన కళాశాల వ్యాయామ విభాగాధిపతి డి.హేమచంద్రరావును అభినందించారు. హిందూ హైస్కూల్ సంస్థల అడ్మి నిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు విజేతలను అభినందించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): అర్నాబ్ తుపాను నేపథ్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివరామప్రసాద్ అధికారులకు సూచించారు. సీడబ్ల్యూసీ గోడౌన్‌లోని సరుకుల రవాణా కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. జిల్లాలో నవంబరుకు సంబంధించి స్టేజ్–1 ద్వారా 7,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, స్టేజ్–2 ద్వారా జిల్లాలోని మొత్తం 1059 రేషన్ షాపులకు నవంబరు నెలకు సంబంధించిన సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.


