రెండున్నరేళ్లలో జిల్లాలో వందలాది మందికి డయేరియా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులివ్వకుండా నిర్వీర్యం డ్రైనేజీ పనులు నిలిచిపోయిన వైనం
విజయవాడపై నిర్లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో రెండున్నరేళ్ల చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో వందలాది మంది ప్రజల డయేరియా బారిన పడ్డారు. విజయవాడలో న్యూరాజరాజేశ్వరిపేట, గిరిపురంతో పాటు, జగ్గయ్యపేట, పెనుగ్రంచిప్రోలు, విస్సన్నపేటల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఉయ్యూరు, కంకిపాడుల్లో సైతం పెద్ద సంఖ్యలో డయేరియా కేసులు నమోదు కావడం తెలిసింది. రాష్ట్రంలో 2019–24 మధ్యలో కోవిడ్ మినహా డయేరియా సోకిన సందర్భాలు లేవు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త పారిశుద్ధ్యంతో పాటు, నీటి సరఫరాపై శ్రద్ధ చూపక పోవడం, నిధులు లేమి వంటి కారణాలు ప్రజలకు శాపంగా మారాయి.
వందలాది మంది డయేరియా బాధితులు
కారణం తేల్చని ప్రభుత్వం
నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట, గిరిపురంలో పెద్ద సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడినా ఇప్పటికీ డయేరియా రావడానికి కారణాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. ఉయ్యూరు, కంకిపాడుల్లో కూడా నేటికీ కచ్చితమైన కారణం చెప్పలేదు. చైన్నె ల్యాబ్‌కు పంపాం, పుణే ల్యాబ్‌కు పంపాం అని మాత్రమే అధికారులు ప్రకటించారు. అంతేకానీ వ్యాధి సోకడానికి స్పష్టమైన కారణాన్ని ఎందుకు చెప్పలేదో ప్రభుత్వానికే ఎరుక.
కలుషిత నీరే కారణమా
విజయవాడలో డయేరియా సోకడానికి ప్రభుత్వం కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరే కారణమని ప్రభుత్వ అప్పట్లో ఆరోపణలు చేశారు. దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు దెబ్బతిన్నాయని, కొత్తవి వేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఇలా జరిగిందని అప్పట్లో న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నగర అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిధులు కూడా విడుదల చేయని పరిస్థితి ఉందంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నిత్యం మీడియా ముందు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యం ఎలా కాపాడతారో పాలకులకే ఎరుక.
కూటమి ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రెండున్నరేళ్లుగా నగరంలో చేపట్టిన ఒక్క అభివృద్ధి పథకం లేదు. డ్రైనేజీ వ్యవస్థను సైతం పట్టించుకోవడం లేదు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు కాలువల్లా మారుతున్నారు. తాగునీటి సరఫరాకు సైతం నిధులు కేటాయించడంతో కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది.
– దేవినేని అవినాష్, అధ్యక్షుడు,
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా


