ఎత్తిపోతల పథకాలు పనిచేయక వెలవెలబోతున్న చెరువులు పోలవరం కాలవలో పట్టిసీమ నీరున్నా చెరువులకు చేరని వైనం ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు 31,951 హెక్టార్లలోనే వరి సాగు 16,880 హెక్టార్ల వరకు బీడుగా మారుతున్న మాగాణి భూములు
జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా బెట్ట పరిస్థితులు కనిపిస్తున్నాయి. జలాలతో కళకళలాడాల్సిన చెరువులు వానలు లేక, ఎత్తిపోతల పథకాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సాగు చేసిన వరిపైరు నీరు లేక ఎండుముఖం పడుతోంది. పట్టిసీమ జలాలు అందుబాటులో ఉన్నా, ఎత్తిపోతల పథకాలను అధికార పార్టీ నిర్వీర్యం చేసింది. వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యం రైతులను కష్టాల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో ఉన్న 542 సాగునీటి చెరువుల్లో 90 శాతం చెరువులు ఎండిపోవడంతో పాటు వాగుల్లో నీరు అందుబాటులో ఉన్న చోట్ల ఎత్తిపోతల పథకాలు పని చేయక మాగాణి భూములు బీడు బారుతున్నాయి.
నిరుపయోగంగా
ఎత్తిపోతల పథకాలు
జి.కొండూరు మండలంలో హెచ్.ముత్యాలంపాడు గ్రామ పరిధిలోని 15.36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, 11.95 ఎకరాల అక్కుల చెరువు, 3.81 ఎకరాల కురివిడి చెరువుకు నీరు నింపేందుకు ఇదే గ్రామం వద్ద బుడమేరుపై రూ.51.48 లక్షలతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఇక్కడే రూ.190 లక్షలతో ఆత్కూరు గ్రామం 58.35 ఎకరాల ఊర చెరువు, 33 ఎకరాల కురివిడి చెరువు, 16.80 ఎకరాల సావరాల చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 125.32 ఎకరాల వెల్లటూరు బంధు చెరువును నింపేందుకు పోలవరం కుడికాలువపై వెలగలేరు వద్ద రూ.109.10 లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడే రూ.40.57 లక్షలతో చేగిరెడ్డిపాడులో 67.53 ఎకరాల వీరయ్య చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.
నీళ్లున్నా ఎత్తిపోయక..
జూలై ఎనిమిదో తేదీన పట్టిసీమ ఎత్తపోతల నుంచి పోలవరం కుడి కాలువలోకి నీరు విడుదలవగా అదే నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలోకి జలాలు ప్రవేశించాయి. పోలవరం కుడి కాలువ మీద ఉన్న వెల్లటూరు, చేగిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాల మోటార్లు పనిచేయక నీటిని తోడి చెరువులను నింపలేదు. దీంతో ఈ చెరువుల కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ చెరువుల కింద ఇప్పటికే వెద పద్ధతిలో సాగుచేస్తున్న వరిపైరు సైతం నీటి తడి అందక ఎండుముఖం పట్టింది. హెచ్.ముత్యాలంపాడు గ్రామం వద్ద బుడమేరుపై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు పోలవరం కుడి కాలువలో ప్రవహిస్తున్న పట్టిసీమ నీరు ఎగదన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఆ రెండు ఎత్తిపోతల పథకాలు నిర్వహణా లోపం కారణంగా చెరువులు వెలవెలబోతున్నాయి. ఆత్కూరు సావరాల చెరువు కింద ఇప్పటికే సాగు చేపట్టిన రైతులు నీరు లేక లబోదిబోమంటున్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ నాయ కులు, పైరు ఎండుతున్నా మోటార్లను ఆడించకుండా వేధించడం వల్లే పొలాలు నెర్రెబారుతున్నాయని రైతులు వాపోతు న్నారు. చెరువులో ఉన్న నీరు తూముల్లోకి రాకపోవడంతో ఇంజిన్‌లతో నీటిని సరఫరా చేసుకొని పైరును బతికిస్తున్నారు. వీటీపీఎస్ బ్యాక్ వాటర్‌తో నడిచే తారకరామా ఎత్తిపోతల పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఈ పథకంలోని కుడికాలువ కింద 4,820 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది.


