ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి తాపీ మేసీ్త్ర మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి తాపీ మేసీ్త్ర మృతి

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి తాపీ మేసీ్త్ర మృతి ఆలయంలో చోరీ కేసు.. నిందితులు అరెస్ట్‌

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణలంక, రణదీవె నగర్‌ కట్ట ప్రాంతానికి చెందిన బలుగూరి దుర్గారావు(43) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఖాళీ సమయంలో అప్పుడప్పుడు కృష్ణానదికి చేపల వేటకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పద్మావతి ఘాట్‌ వద్ద చేపలు పట్టడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఉదయం 10.30 గంటల సమయంలో పద్మావతి ఘాట్‌ రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ నంబర్‌–1 వద్ద చేపలు పడుతుండగా దుర్గారావు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. అది గమనించిన తోటి మత్స్యకారులు మృతుని సోదరుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించగా వెంటనే మృతుని కుమారుడైన వెంకటేశ్వరరావుకు ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పద్మావతి ఘాట్‌ వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అపహరించిన సొత్తు స్వాధీనం

జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాల గ్రామంలోని భవానీ ముక్తేశ్వేర స్వామి వారి దత్తత ఆలయం చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పూర్తి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రూరల్‌ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు తెలిపారు. ఈ నెల ఆరో తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవార్లకు చెందిన 6.5 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగాం చోరీ చేశారన్నారు. సోమవారం జిల్లా ఏసీ చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సీసీ కెమెరాల ఆధారంతో..

ఆలయంలో చోరీ జరగటానికి ముందు నంబర్‌ ప్లేట్‌ లేని కారు ఆలయం చుట్టు పక్కల సంచరించగా, ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి వచ్చి రెక్కీ చేసినట్లు సీసీ ఫుటేజీలలో గుర్తించామని తెలిపారు. దీంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల కోటయ్య అలియాస్‌ కోటేశ్వరరావు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన అల్లుడు కావటంతో తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లోని ఆలయాల పూర్తి సమాచారం సేకరించి పాత నేరస్తులు నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మయ్యపల్లికి చెందిన డేరంగుల మల్లేష్‌, ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలానికి చెందిన కారం సాంబయ్యలతో కలిసి ఆలయంలోకి వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు కోదాడ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించి, వారి వద్ద నుంచి రూ. 15లక్షల విలువ చేసే పూర్తి చోరీ సొత్తు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు చెప్పారు. అనంతరం చోరీ కేసును ఛేదించిన జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ఎస్‌ఐలు రాజు, తోట సూర్య శ్రీనివాస్‌, శంకర్‌, మణికంఠ, అర్జున్‌లతో పాటు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement