షూటర్స్ అసోసియేషన్ తీరుపై విమర్శల వెల్లువ
ఇష్టానుసారంగా పేరు, అకౌంట్లు మార్పు నాయకులందరూ తెలంగాణ చిరునామా వారే శాప్ పరిశీలన లేకుండానే కార్యవర్గం ఎన్నికలు ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలంటున్న షూటర్లు
నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ మౌనం..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి, పతకాలు సాధించేలా చేయాల్సిన క్రీడా సంఘాలు వారి సొంత ప్రయోజనాల కోసం క్రీడాకారులతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు కూటమి ప్రభుత్వంలో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవహారం కాస్త శృతి మించిందంటూ షూటర్లు వాపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీదనే రెండు రాష్ట్రాల్లోని షూటర్లు వివిధ స్థాయిలో జరిగే టోర్నమెంట్స్‌కు హాజరవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన అసోసియేషన్ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్‌కే షూటర్లు వారి ఫీజులన్నీ(కాంపిటేషన్, మేనేజర్, మెంబర్‌షిప్ ఫీజులు) జమ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది మే నుంచి అకౌంట్ నంబరుతో పాటుగా రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును ‘ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా మారింది. ఈ విధంగా అకస్మాత్తుగా అసోసియేషన్ పేరు మార్చడంలో ఉన్న మతలబు ఏమిటనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులకు సైతం అంతపట్టడం లేదు. పేరు మార్పుపై సభ్యులు అడిగితే స్పెల్లింగ్ మిస్టేక్ అని, పొర పాటున పడిందంటూ సంఘం నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సభ్యులు చెప్పారు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోని బ్యాలె న్స్ జీరో అయినట్లుగా ఆన్‌లైన్‌లో చూపిస్తోందని కొంత మంది సభ్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరపాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న శాప్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024లోనే శాప్ దగ్గర రెన్యూవల్ చేయించుకోవాలి. అయితే రెన్యూవల్ చేసుకోకుండానే రెండు రాష్ట్రాల నుంచి టోర్నమెంట్‌కు షూటర్లను పంపుతున్నా.. శాప్ ఏవిధమైన స్పందన లేకుండా చోద్యం చూస్తోంది. అదేమంటే క్రీడా సంఘాలు అన్ని తమ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్‌ను తమకు సమర్పించి రెన్యూవల్ చేసుకోవాలని కేవలం పేపర్ ప్రకటనలు జారీ చేసి మిన్నకున్నారు. అసలు ఎన్ని క్రీడాసంఘాలకు గుర్తింపు ఉందనే పూర్తి సమాచారం ఇప్పటి వరకు శాప్ దగ్గర లేదంటే వారు పనితీరును అర్థం చేసుకోవచ్చు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరును ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన విషయం కూడా శాప్ దృష్టిలో లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌లో కూడా ఈ సంఘానికి గుర్తింపు లేదని సమాచారం.
నాయకులంతా తెలంగాణలోనే..
ది రైపిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవలే తాడేపల్లిలోని ఒక క్లబ్‌లో జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక చాలా గోప్యంగా జరిగింది. ఈ సమావేశానికి అబ్జర్వర్‌ను పంపాలని శాప్‌కు అసోసియేషన్ నాయకులు లేఖను ఈ–మెయిల్ ద్వారా పంపారు. మీ అసోసియేషన్ పూర్తి వివరాలను పంపితే, వాటిని పరిశీలించి అప్పుడు చూస్తామంటూ శాప్ నుంచి రిప్లయ్ వచ్చింది. తీరా శాప్ నుంచి అబ్జర్వర్ లేకుండానే ఎన్నిక ప్రక్రియను అసోసియేషన్ సభ్యులు పూర్తి చేశారు. ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధితో పాటుగా తెలంగాణకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యుడిని ఈ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించి, వారి సమక్షంలో ఎన్నిక ప్రక్రియను ముగించారు. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి.లలిత్‌ను అధ్యక్షుడిగా, కార్యదర్శిగా రాజ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. మరి ఆంధ్రప్రదేశ్‌లోని షూటర్లు, కోచ్‌లు ట్రైనింగ్ క్యాంపుల గురించి, వారికి ఏమైనా సందేహాలు, ఇబ్బందుల గురించి అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా అంటూ క్రీడాకారులు, కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ ఈట్‌స్ట్రీట్‌లో ఉన్న వెంకటేశ్వర గన్‌హౌస్‌లో జూన్ 17వ తేదీన గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో.. గుంటూరు జిల్లాకు చెందిన విజయహర్ష అనే వ్యక్తి నకిలీ అస్పైరింగ్ సర్టిఫికెట్లతో గన్‌లను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని వద్ద మూడు గన్‌లు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే అసలు విజయహర్షకు ఈ నకిలీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? దీనిలో అసోసియేషన్‌లోని సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? ఇలా ఎంత మందికి ఈ విధంగా అస్పైరింగ్ సర్టిఫికెట్లు ఇప్పించాడు? అనే విషయాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఇంత పెద్ద ఘటనపై అసోసియేషన్ కాని, శాప్ కాని, ఒలింపిక్ అసోసియేషన్ గాని స్పందించలేదు. నకిలీ సర్టిఫికెట్లు చూపించి విజయహర్ష తిరుపతిలో శాప్‌లో షూటింగ్ కోచ్‌గా జాయిన్ అయినా విచారణ జరపలేదు.


