న్యూస్‌రీల్
కనీస సౌకర్యాలు లేమి
ఆత్మవిశ్వాసం, సేవాభావం పెంపొందించడమే లక్ష్యం
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మచిలీపట్నంఅర్బన్: స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించాల్సిన అధికారులు అందుకు తగిన కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఏడాదికి ఒకసారి ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతుండటం విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పీఎం శ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ అందిస్తోంది. అయితే ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇదే తరహా శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా తగిన చర్యలు లేవు. అయితే ప్రభుత్వం నిధులివ్వకపోయినా విద్యార్థులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు రూ.4,000 వసూలు చేసి శిక్షణకు పంపిస్తున్నారు.
కృష్ణాజిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 32 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా 31 పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల చొప్పున గ్రాంట్ విడుదల చేసింది.ఈ ఏడాది స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణకు 26 పీఎం శ్రీ పాఠశాలలు, రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 28 పాఠశాలల నుంచి 28 మంది ఎస్కార్ట్ టీచర్లు శిక్షణకు హాజరవుతున్నారు. ఒక్కో పాఠశాల నుంచి ఎనిమిది మంది చొప్పున మొత్తం 224 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతి ఏడాది బాలబాలికలకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ నిర్వహిస్తారు. 2025–26లో విడుదలైన గ్రాంట్‌లో భాగంగా ఏప్రిల్‌లో బాలికలకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం బాలురకు శిక్షణ కొనసాగుతోంది. మంగళవారం రెండో రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు.
ఈ శిక్షణలో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి. ప్యాట్రోల్ లీడర్ ట్రైనింగ్, ప్రవేశ్ నుంచి ద్వితీయ సోపాన్ వరకు శిక్షణ. ఇందులో 112 మంది విద్యార్థులు ప్యాట్రోల్ లీడర్ ట్రైనింగ్‌లో, మరో 112 మంది ప్రవేశ్ నుంచి ద్వితీయ సోపాన్ శిక్షణలో పాల్గొంటున్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు వచ్చిన విద్యార్థులకు ఇచ్చిన వసతి గృహంలోని గది
శిక్షణార్థులకు వసతికి కేటాయించిన భవనం
224 మంది విద్యార్థులకు ఐదు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడం విచారకరం. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, శిక్షణకు అనువైన వాతావరణం వంటి ప్రాథమిక సదుపాయాలపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పాఠశాలలకు గ్రాంట్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆ నిధులు విద్యార్థుల ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్నదీ పరిశీలించాల్సి ఉంది. విద్యార్థులకు క్రమశిక్షణ, సేవాభావం నేర్పే ఇటువంటి మంచి కార్యక్రమానికి కనీస సౌకర్యాలు లేకపోతే ఇక ఈ శిక్షణ ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జి బీఎన్‌వీ భాస్కరరావు, జిల్లా కార్యదర్శి పి.లలిత్ మోహన్ ఈ పరిస్థితులపై దృష్టి సారించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా విద్యార్థులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతున్నాం. శిక్షణలో భాగంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఇబ్బందులను అధిగమించేలా శిక్షణ ఉంటుంది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సేవాభావం పెంపొందించడమే శిక్షణ ప్రధాన ఉద్దేశం.
– పి.లలిత్ మోహన్,
స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి


