దరఖాస్తుకు సవాలక్ష ఆంక్షలు
సచివాలయాల్లో అందని ధ్రువీకరణ పత్రాల సేవలు
మీ సేవా కేంద్రాలకు దరఖాస్తుదారుల పరుగులు
సర్వర్ మొరాయింపుతో ఉద్యోగుల వెతలు
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న లబ్ధిదారులు
ఇబ్బంది పెడుతున్నారు..
కృత్తివెన్ను: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లకు ప్రారంభించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో విధించిన సవాలక్ష ఆంక్షల కారణంగా దరఖాస్తుదారులు నానా పాట్లు పడుతున్నారు. దీనికి తోడు సర్వర్ మొరాయించడంతో ఉద్యోగులు ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు.
గడువు మూరెడు.. లిస్ట్ బారెడు...
ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు సామాజిక పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం తెర తీసింది. అందుకు అనుగుణంగా దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు అవసరమైన రీతిలో సర్వర్ పని చేయడం లేదు. దీంతో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్న పని జరగడం లేదు. గడువు మూరెడు.. జాబితా బారెడుగా ఉందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
సచివాలయాల్లో సేవలేవి ?
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్, రైస్ కార్డులతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ హిస్టరీ తప్పని సరిగా పొందు పరచాల్సి ఉంది. ఇప్పటి వరకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల ద్వారా అందించే వారు. ప్రస్తుతం ఉద్యోగులంతా అర్జీల ఆన్‌లైన్‌పైనే దృష్టి సారించడం, అన్ని పనులు ఒకే కంప్యూటర్లలో చేయాల్సి రావడంతో ధ్రువీకరణ పత్రాలను మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు సచివాలయాల నుంచి మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా కొందరు మీ సేవ నిర్వాహకులు తమ వద్ద ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే బాండ్లు లేవని తిప్పి పంపేస్తున్నారు. దీంతో చాలా మంది ఏం చేయాలో తోచక ఉసురుమంటున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం గతంలో మాదిరి పింఛన్ దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల ద్వారానే అందించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో నరసింహరావును వివరణ కోరగా ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సచివాలయాల ద్వారానే వాటిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో ప్రభుత్వాలు పింఛన్లను నెల నెలా తరువాత ఆరుమాసాలకొకసారి మంజూరు చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ పింఛన్లు ఇవ్వలేదు. ప్రస్తుతం వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల పేరుతో దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నారు. సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలకు మీ సేవకు పంపడం సరికాదు. దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి.
– మైల రత్నకుమారి, జెడ్పీటీసీ కృత్తివెన్ను


