గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వినాయక చవితి ఉత్స వాలకు ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. మండపాల్లో తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు మాత్రమే వినియోగించాలని, మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ వైరింగ్, ఇతర పనులను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు. అధిక లోడ్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగ్, రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని, వర్షాల సమయంలో విద్యుత్ పరికరాలు, వైర్లు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తడిసిన విద్యుత్ పరికరాలను చేతితో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు సీఎండీ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు.


