పార్టీ బందరు నగర అధ్యక్షుడు గడ్డం రాజు, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు మధ్య బాహాబాహీ ముదురుతున్న మేయర్ అభ్యర్థిత్వ వివాదం కోర్టులో విచారణ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం జనసేనలో వివాదంపై చర్చించుకుంటున్న నగర వాసులు
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం జనసేన పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన నాయకులు ఆదివారం బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. నగరంలోని ఎనిమిదో డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలోని ఓ జనసేన నాయకుడి ఇంటి ఫంక్షన్‌లో పాల్గొన్న ఇరువర్గాల జనసేన నాయకుల మధ్య వాగ్వాదం, దాడి ప్రతిదాడులు జరిగాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన సంభాషణల సందర్భంగా జనసేన నాయకుడు, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావుపై జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు దాడికి పాల్పడ్డాడు.
రెండు వర్గాలుగా విడిపోయి..
ఘటనతో అక్కడున్న జనసేన పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద పెట్టున వాగ్వాదాలకు దిగారు. గడ్డం రాజుపై ప్రతిదాడి జరుగుతుందనే కారణంతో ఆయన్ను పక్కనే ఉన్న గృహంలో దాచారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి రాజును అక్కడి నుంచి పహారా నడుమ తీసుకెళ్తున్న సందర్భంలో వెంకట్రావు.. రాజును అడ్డగించి ప్రతి దాడికి పాల్పడ్డారు. పోలీసులు రాజును రక్షణ వలయంలో అక్కడి నుంచి తీసికెళ్లిపోయారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలని..
గడ్డం రాజు వెంకట్రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై అక్కడే ఉన్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణపై కూడా వెంకట్రావు వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి రామకృష్ణ అనుయాయుడిగా ఉన్న గడ్డం రాజు ఇటీవల రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించడంతో ఈ ఘటనకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. తనకెవరు చెప్పినా వాడిని(రాజు) వదిలేది లేదని వెంకట్రావు సవాల్ విసురుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ ఘటనకు దారితీస్తుందోననే చర్చ నగరంలో జరుగుతోంది. మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్‌లకు పెంచేందుకు గాను అధికారులు డివిజన్‌ల బౌండరీస్‌ను అనైతికంగా, నిబంధనలకు విరుద్ధంగా చేశారనే కారణంతో మాజీ కార్పొరేట్లు హైకోర్టును ఆశ్రయించటం పాఠకులకు విదితమే. కేసుపై కోర్టు ఎలాంటి తీర్పునూ వెలువరించకపోవటంతో ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సంశయం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు మేయర్ అభ్యర్థిత్వంపై బాహాబాహీలకు దిగడంపై నగర ప్రజలు చర్చించుకుంటున్నారు.


