వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి
గుడివాడ రూరల్: రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి. ఎస్.నాగిరెడ్డి విమర్శించారు. గుడివాడ రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. –52.76 శాతం వర్షాభావంతో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం, రైతులు ఉన్నారన్నారు. చెల్లించాల్సిన హామీల బకాయిలతో పాటు రైతులకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్‌నినో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కట్టు కథలు చెబుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ వరకు జరగాల్సిన మొత్తం సాధారణ సాగులో 95.67 శాతం (2,611లక్షల ఎకరాలు), సరిహద్దున ఉన్న తెలంగాణలో 88 శాతం (117లక్షల ఎకరాలు), ఏపీలో మాత్రం 61 శాతం (46.7లక్షల ఎకరాలు)లో మాత్రమే సాగు జరిగిందని వివరించారు. ఆగస్టు 20నాటికి భారత వాతావరణశాఖ –20 శాతం నుంచి –59 శాతం వరకు లోటు వర్షపాతం ఉంటుందని తెలపగా ఏపీలో –52.7 శాతం, కర్నాటకలో –30 శాతం, బిహార్‌లో –40 శాతం, పంజాబ్‌లో –28 శాతం మాత్రమే లోటు వర్షపాతం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అందరూ రైతులకు ఉచిత పంటల బీమాను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పాలకులు స్పందించకపోతే.. రైతుల పక్షాన పోరాడతామని.. నాగిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిద్ధార్థ మెడికల్ కాలేజీ
అభివృద్ధే లక్ష్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాలేజీ ప్రిన్సిపాల్, పూర్వ విద్యార్థి డాక్టర్ ఎ.ఏడుకొండలరావు అమెరికాలో పర్యటిస్తున్నట్లు కాలేజీ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ వైద్యులు, కాలేజీ పూర్వ విద్యార్థులతో సమావేశమవుతూ కాలేజీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చిస్తున్నారని తెలిపారు. అమెరికాలోని వివిధ మెడికల్ స్కూళ్లు, ఆసుపత్రులను సందర్శిస్తూ బోధనా సౌకర్యాల మెరుగుదల, వైద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఆధునిక క్లినికల్ స్కిల్స్, రోగుల సంరక్షణ వంటి అంశాలపై వైద్య నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలబామా రాష్ట్రంలోని హంట్స్‌విల్ నగరాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐ వైద్యులను కలుసుకున్నారు. సీనియర్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఆలపాటి ఆంజనేయులు, అనస్థీషియాలజిస్ట్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ మురళి, సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ తోటకూర నాగేంద్ర తదితరులతో సమావేశమై కాలేజీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి వారి సలహాలు, సూచనలు, సహకారాన్ని కోరారన్నారు. అట్లాంటాలో సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగనున్న గుంటూరు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్‌లో పాల్గొని కాలేజీ అభివృద్ధిపై చర్చిస్తారని చెప్పారు.


