● సుమారు రూ.2 లక్షల గృహోపకరణాలు దగ్ధం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మారుతీనగర్‌లో ఆదివారం విద్యుత్ హైఓల్టేజీ రావడంతో స్థానికులు హడలిపోయారు. దీంతో సుమారు రూ.2 లక్షల విలువైన గృహోపకరణాలు పాడయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మారుతీనగర్ మసీదు రోడ్డులోని పది ఇళ్లకు హైఓల్టేజీ రావడంతో స్విచ్‌బోర్డు, ఏసీలు, ఫ్యాన్లు, కంప్యూటర్‌ల నుంచి మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేశారు. అప్పటికే ఆన్‌లో ఉన్న విద్యుత్ పరికరాలు పాడయ్యాయి. దీనిపై ఈ ప్రాంతవాసులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందజేశారు.
వారు ఘటనాస్థలికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేశారు. పక్కన వెంకటేశ్వరరావు వీధిలోలో విద్యుత్ తీగలు పక్కన ఉన్న చెట్లు కొట్టడంతో విద్యుత్ వైర్లుపై పడి హైవోల్టేజీ వచ్చిందని తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ విలువైన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు


