అటకెక్కిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రుణమాఫీ హామీ గెలిచి రెండేళ్లు అవుతున్నా రుణమాఫీ ఊసెత్తని ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మాటలు విని నట్టేటమునిగాం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఎమ్మెల్యేగా గెలిస్తే గుడివాడ టిడ్కో కాలనీ ప్లాట్ల రుణాలను మాఫీ చేస్తా. ఇందుకు నా సొంత నిధులు చెల్లిస్తా’ ఇదీ ఎన్నికల సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన హామీ. ‘రుణాలను చెల్లించడానికి నేనేమైనా టాటానా? బిర్లానా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తే రుణమాఫీ చేయిస్తా’ ఇవీ గెలిచిన తర్వాత చెబుతున్న మాటలు. టిడ్కో ఇళ్ల రుణాలపై ఎమ్మెల్యే తీరు ప్రస్తుతం గుడివాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కోకు మోక్షం
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చొరవతో టిడ్కో కాలనీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టిడ్కో కాలనీ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు మంజూరు చేశారు. ప్లాట్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేశారు. మిగతా వసతుల కల్పనకు సైతం కోట్లాది రూపాయలు కేటాయించారు. కూటమి అధికారంలోకి రావడంతో మిగిలిన సమస్యల పరిష్కారం అటకెక్కింది.
నట్టేటముంచిన ఎమ్మెల్యే హామీ
ఎన్నికల్లో గుడివాడ సీటును ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాముకు తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అక్కడి నుంచి రాము ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారు. అమలకు సాధ్యకానీ హామీలను గుప్పించారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో టిడ్కో కాలనీకి వచ్చిన రాము తాను ఎమ్మెల్యేగా గెలిస్తే టిడ్కో కాలనీ వాసుల ఇళ్ల రుణాలను తన సొంత నిధులతో చెల్లించి మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నిజంగానే నెరవేరుస్తారని నమ్మిన నిరుపేద టిడ్కో కాలనీవాసులు ఎన్నికల్లో రాముకు ఓట్లు వేశారు. గెలిచి రెండేళ్లు దాటినా ఇంత వరకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిటబెట్టుకున్న పాపానపోలేదు. ఎమ్మెల్యే హామీ నెరవేర్చాలంటూ టిడ్కో కాలనీ వాసులు రెండేళ్లుగా ఆందోళనలు, నిరసనలు, ఏకంగా నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. అయినా ఎమ్మెల్యే నుంచి ఉలుకు, పలుకు లేదు. ఎమ్మెల్యే రుణాలు చెల్లిస్తాడని నమ్మిన నిరుపేదలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా ఉండటంతో రుణాలకు వడ్డీలు అంతకంతకు పెరిగి తడిసి మోపెడ య్యాయి. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి ప్రతిరోజు నానా యాగీ చేయడం, బోర్డులు పెట్టడంతో నిరుపేద టిడ్కో కాలనీ వాసులు మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికై నా మాట నిలబెట్టుకుంటారా, చరిత్రలో నిరుపేదలకు ముంచిన ఎమ్మెల్యేగా నిలిచిపోతారో ఎమ్మెల్యే తేల్చుకోవాలంటూ టిడ్కో కాలనీ వాసులు కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి నెరవేర్చే రాజకీయ నాయకులను చూశాం. ఇంత దారుణంగా హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే ప్రజాప్రతినిధిని గుడివాడలోనే చూస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు.
– సునీత, టిడ్కో కాలనీ లబ్ధిదారు


