సర్వేను అడ్డుకున్న అంబేడ్కర్‌ కాలనీవాసులు | - | Sakshi
Sakshi News home page

సర్వేను అడ్డుకున్న అంబేడ్కర్‌ కాలనీవాసులు

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో ఆర్‌ఎస్‌ నంబరు 283/1లో మంగళవారం రెవెన్యూ, విమానాశ్రయ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వేను అంబేడ్కర్‌ కాలనీవాసులు అడ్డుకున్నారు. మీర్జాపురం జమీందారు నుంచి చట్ట పరంగా తమకు సంక్రమించిన భూములను లాక్కునే ప్రయత్నాలను విమానాశ్రయ అధికారులు విరమించుకోవాలని ఆందోళనకు దిగారు. విమానాశ్రయ, రెవెన్యూ అధికారులు, కాలనీవాసుల మధ్య కొద్ది సేపు వాదో పవాదాలు జరిగాయి. కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా న్యూకాలనీ డెవలప్‌మెంట్‌ కమిటీ అధ్యక్షులు మోట్రు ఆంథోని మాట్లాడుతూ.. 1964లో మీర్జాపురం జమీందారులు కోర్టు దావా రాజీ షరతుల మేరకు సర్వే నంబరు 283/1లోని 4.80 ఎకరాల భూమి తమకు సంక్రమించిందన్నారు. అప్పటి నుంచి ఆ భూమి తమ ఆధీనంలోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు కూడా ధ్రువీకరించారని పేర్కొన్నారు. 2015–17 మధ్య మూడు కుటుంబాలు తప్పుడు పత్రాలు సృష్టించి కొంత భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయని తెలిపారు. ఈ విషయమై జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రాగ, సదరు ఆక్రమణదారులు సీనియర్‌ సివిల్‌ కోర్టులో అప్పిల్‌కు వెళ్లారని వివరించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే విమానాశ్రయ భూములు తమ సర్వే నంబర్‌లో ఉన్నట్లుగా అధికారులు సర్వే నిర్వహించారని తెలిపారు. ఈ విషయమై గుడివాడ ఆర్డీఓను ఆశ్రయించగా ఎయిర్‌పోర్ట్‌, రెవెన్యూ, కాలనీవాసులకు నోటీసులు జారీచేసి న్యాయవాది సమక్షంలో డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ నెల 18న కాలనీవాసులు హాజరుకావాలని తహసీల్దారు ఉత్తర్వులు ఇవ్వగా 15 రోజులు గడువు కోరినట్లు పేర్కొన్నారు. అందుకు విరుద్దంగా విమానాశ్రయ, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ నెల 29, 30 తేదీల్లో సర్వే నిర్వహించేందుకు వస్తే తగిన ఆధారాలను సమర్పిస్తామని అధికారులకు స్పష్టం చేసినట్లు వివరించారు. కాలనీ పెద్దలు సాతులూరి రవిప్రకాష్‌, పొంగులేటి సుధాకర్‌, దాసరి యేసుపాదం, నీలం మహోదయ ఆంథోని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement