గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పూర్తిగా భ్రష్ఠుపట్టిందని మాజీ పోలీసు అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు విమర్శించారు. సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, నల్లమోతు చక్రవర్తితో కలిసి మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ను నియమించలేదన్నారు. దీనిని బట్టే ఏపీపీఎస్పీపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందన్నారు. గ్రూప్ వన్ వంటి పెద్ద పరీక్షలు నిర్వహించే కెపాసిటీని ఏపీపీఎస్సీ కోల్పోయిందన్నారు. ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు, దాని ద్వారా నియామకాలు ఆశించే యువత, చదువుకున్న పిల్లలకు మేలు జరగదన్నారు.
కంచికచర్ల: ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మోగులూరులో సోమవారం జరిగింది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ కథనం మేరకు.. కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన షేక్ షకీలా(35)కు అదే గ్రామానికి చెందిన షేక్ జాన్‌బాబుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జాన్‌బాబు మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవలు పడేవాడు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నెల 16వ తేదీ రాత్రి సమయంలో జాన్‌బాబు మద్యం తాగి ఇంటికి వచ్చి షకీలాతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపం చెందిన షకీలా నెల 17వ తేదీ రాత్రి సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కంచికచర్ల: గుర్తు తెలియని మహిళ మృతదేహం మునేరులో లభ్యమైందని ఎస్‌ఐ పి.విశ్వనాథ్ మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. కంచికచర్ల మండలం కీసర వద్ద మునేరుపై నిర్మించిన పాత బ్రిడ్జి కింద నీటిలో సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయసు మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. మహిళ ఒంటిపై ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గళ్ల డిజైన్ కలిగిన పంజాబీ టాప్, ఎరుపు రంగు లెగ్గిన్ ఉన్నాయి. కుడిచేతిపై కేఎం అక్షరాల పచ్చబొట్టు, మెడలో తాయత్తు ఉన్నాయి. ఆమె మూడు రోజుల క్రితం మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతరులు ఎవరైనా తీసుకొచ్చి హత్యచేసి మునేరులో పడేశారా లేక బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీసర వీఆర్వో ఎస్.సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 94407 96460, 08678 – 274333 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


