రూ.30 వేలకు రాజీచేసిన మాజీ కార్పొరేటర్ అంత్యక్రియలను స్వర్గపురి సిబ్బంది అడ్డుకోవడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
వించిపేట(విజయవాడపశ్చిమ): స్థానిక 50వ డివిజన్, గొల్లపాలెంగట్టు రోడ్డులో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటనపై కేసు కాకుండా వామపక్ష మాజీ కార్పొరేటర్ ఒకరు పంచాయితీ చేశారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వర్గపురికి తీసుకెళ్లగా, వంటిపై గాయాలను చూసి అక్కడి సిబ్బంది అడ్డుకోవ డంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. మరగడ వెంకటరెడ్డి (55) వంట మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలసి గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గొల్లపాలెంగట్టు రోడ్డులో మద్యం మత్తులో ఉన్న వెంకట రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన కొప్పుల శేఖర్ మధ్య ఏదో విషయంపై ఘర్షణ తలెత్తింది. వెంకటరెడ్డిని శేఖర్ తీవ్రంగా కొట్టి కిందపడిన అతడిని పైకి లేపి బలంగా వెనక్కు విసిరేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం మృత దేహాన్ని పక్కనే అరుగుమీద పడుకోపెట్టి శేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తెల్లవారిన తరువాత వెంకటరెడ్డి మృతి వెలుగుచూసింది.
మాజీ కార్పొరేటర్
పంచాయితీ
కుటుంబ సభ్యులు కేసు పెట్టకుండా ఉండేందుకు వామపక్ష మాజీ కార్పొరేటర్ ఒకరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని తన పార్టీ కార్యాలయంలోనే వెంకటరెడ్డి, శేఖర్ కుటుంబాల సభ్యుల మధ్య పంచాయితీ చేశారు. కేసు పెట్టకుండా ఉంటే రూ.30 వేలు ఇప్పిస్తానంటూ రాజీ చేశారని సమాచారం. అనంతరం వెంకటరెడ్డి మృతదేహాన్ని దహనం చేసేందుకు మంగళవారం హడావుడిగా స్వర్గపురికి తీసుకెళ్లగా మృతుడి వంటిపై గాయాలు ఉండటంతో పోలీసుల రిపోర్టు ఉంటేనే అంత్యక్రియలు చేస్తామని అక్కడి సిబ్బంది స్పష్టంచేశారు. అక్కడి నుంచి వాంబే కాలనీ, కండ్రికలోని శ్మాసనవాటికలకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో వెంకటరెడ్డి కుమారుడు అప్పలరెడ్డి తన తండ్రి మృతదేహంతో పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


