దుర్గమ్మ సేవలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజమౌళి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజమౌళి

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

దుర్గమ్మ సేవలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజమౌళి పోలీసు జీపు దహనం కేసులో ఇద్దరికి జైలు అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో యజ్ఞసాయికి రజతం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఎ.వి.రాజమౌళి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. అమ్మ దర్శనానికి విచ్చేసిన రాజమౌళికి ఆలయ ఈఓ శీనానాయక్‌ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ శీనానాయక్‌, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.

విజయవాడలీగల్‌: మార్కాపురం జిల్లా గిద్ద లూరు పోలీసుస్టేషన్‌లోని పోలీసు జీపును తగలబెట్టిన కేసులో ఇద్దరు నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి ఎ.అనిత మంగళవారం తీర్పు చెప్పారు. రెండు సెక్షన్ల కింద ఒక్కొక్క సెక్షన్‌ ప్రకారం సంవత్సరం జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధించారు. 2014 జూలై ఒకటో తేదీన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అతని సోదరుడు కృష్ణకిషోర్‌రెడ్డి సహా 21 మంది అనుచరులు పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. అక్కడున్న పోలీసు జీపును తగులబెట్టారు. గిద్దలూరు పోలీసులు ఐపీసీ 435 రెడ్‌విత్‌ 149, సెక్షన్‌ 4 ఆఫ్‌ పీడీపీపీ యాక్టు కింద 21 మందిపై కేసు నమోదుచేశారు. అనంతరం విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే న్యాయస్థానంలో నిందితులను హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ తల్లాప్రగడ సుబ్బారావు, డిఫెన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో ఉండగా ముగ్గురు నింది తులు మరణించగా, మిగిలిన 18 మందిలో 16 మందిని నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. మిగిలిన ఏ–12 సయ్యద్‌ షానిషా వలి, ఏ–13 పాలగుళ్ల చినశ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో పైవిధంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న 52వ జూనియర్‌ జాతీయ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విజయవాడ నగరానికి చెందిన స్విమ్మర్‌ ఎం.యజ్ఞ సాయి–200 మీటర్ల ఫ్రీస్టైల్‌ బాలుర (గ్రూప్‌–1బీ) విభాగంలో 1:56.63 సెకన్ల సమయంలో పూర్తి రజత పతకం సొంతం చేసుకున్నాడు. పతకం సాధించిన ఎం.యజ్ఞ సాయికి అమెచ్యూర్‌ అక్వాటిక్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎ.మోహన్‌ వెంకట్‌రామ్‌, ఎన్టీఆర్‌ జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొంగర రవికాంత్‌, కార్యదర్శి ఐ.రమేష్‌, విజయవాడ కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌ పూల్‌ ఇన్‌చార్జ్‌ అనిల్‌, కోచ్‌లు మాల్యాద్రి, లక్ష్మణ్‌, అసోసి యేషన్‌ సభ్యులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించబోమని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (యూఎస్‌ఎఫ్‌ఐ) ఆరోపించింది. మంగళవారం యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ నందు నిరసన కార్యక్రమం జరిగింది. యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కుమార్‌, కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ముందు విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లు రూ.7 వేల కోట్లకు పైగా బకాయి పెట్టిందన్నారు. ఫలితంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేదల ఉన్నత విద్యకు ఆటంకంగా ఉన్న జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కాలేజీలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు వెళ్లకుండా ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను తెలుసుకునే హక్కును ఎవరూ హరించలేరని, ఈ నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు భీమేష్‌, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, కమలాకర్‌, ఆఫ్రిద్‌, గణేశ్‌ వివిధ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement