కాన్పులకు సర్కారీ దవాఖానో | - | Sakshi
Sakshi News home page

కాన్పులకు సర్కారీ దవాఖానో

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

కాన్పులకు సర్కారీ దవాఖానో ప్రభుత్వ ప్రసూతి సేవలకు తగ్గుతున్న ఆదరణ? మచిలీపట్నం అర్బన్‌: ప్రసవాల సంఖ్య జిల్లాలో క్రమంగా తగ్గుతుండగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2023లో జిల్లాలో 15,391 ప్రసవాలు నమోదుకాగా.. 2024లో 13,536కు, 2025 నాటికి ఆ సంఖ్య 12,385కు పడిపోయింది. అంటే రెండేళ్లలోనే 3,006 ప్రసవాలు తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా తగ్గడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసూతి వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. మెరుగైన సౌకర్యాలు, వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య బీమా తదితర కారణాలతో పలువురు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2024లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,329 ప్రసవాలు నమోదుకాగా.. 2025లో ఈ సంఖ్య 4,757కు పడిపోయింది. 2026 జూన్‌ నాటికి కేవలం 2,057 ప్రసవాలే నమోదయ్యాయి. మరోవైపు ప్రైవేటు, ప్రభుత్వేతర ఆసుపత్రుల్లో 2024లో 5,207గా ఉన్న ప్రసవాలు.. 2025లో 7,628కు పెరిగాయి. 2026 జూన్‌ నాటికి 3,697 ప్రసవాలు నమోదయ్యాయి. ‘పిల్లలే సంపద’ అంటూ ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మూడో సంతానానికి రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. జిల్లాలోని గణాంకాలు మాత్రం జననాల సంఖ్య పెరుగుతున్న సంకేతాలను ఇవ్వడం లేదు. పిల్లల పెంపకం, విద్య, వైద్యం, జీవన వ్యయం, భవిష్యత్తు భద్రత వంటి అంశాలే కుటుంబాల నిర్ణయాల్లో కీలకంగా మారుతున్న నేపథ్యంలో.. కేవలం నగదు ప్రోత్సాహకాలతో సంతానాన్ని పెంచేలా చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రెండు కాన్పుల అనంతరం నిర్వహించే శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని ప్రభుత్వ ఆస్పత్రులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. పిల్లల మధ్య తగిన విరామం పాటించాలని గతంలో సూచించిన ఆస్పత్రులు.. ప్రస్తుతం త్వరగా మరో గర్భధారణకు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఖండించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు.

అసలు కారణాలేమిటో తేల్చాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఎందుకు తగ్గుతున్నాయి? ప్రైవేటు ఆస్పత్రుల వైపు గర్భిణులు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది, ప్రసూతి సేవల నాణ్యత, ప్రజల అభిప్రాయం వంటి అంశాల్లో ఏమైనా లోపాలున్నాయా? అనే అంశాలపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తల్లి, బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాణ్యమైన ప్రసూతి సేవలే లక్ష్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గడాన్ని ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసం తగ్గిందని భావించడం సరికాదని డాక్టర్‌ పి.ఎల్‌. దయాకర్‌ తెలిపారు. గర్భిణులకు ఉచిత ప్రసూతి సేవలు, సిజేరియన్‌ శస్త్రచికిత్సలు, నవజాత శిశు సంరక్షణ, మందులు, పరీక్షలు, జనని శిశు సురక్ష కార్యక్రమం వంటి సేవలను అందిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యాలు, ఆరోగ్య బీమా తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు ప్రైవేటు ఆస్పత్రులను ఎంచుకుంటున్నారని వివరించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. పిల్లల మధ్య తగిన విరామం పాటించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలే కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ ప్రసూతి సేవలకు తగ్గుతున్న ఆదరణ?

రెండేళ్లలో

3,006 ప్రసవాలు తగ్గుదల..

పని చేయని చంద్రబాబు ప్రోత్సాహకాలు

ప్రైవేటు ఆస్పత్రుల వైపు

పెరుగుతున్న మొగ్గు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో

సగానికిపైగా తగ్గుదల

నగదు ప్రోత్సాహకాలతో పెరగని జననాలు

కుటుంబ నియంత్రణపై ప్రచారానికి తెర?

– డాక్టర్‌ పి.ఎల్‌. దయాకర్‌,

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement