చిలకలపూడి(మచిలీపట్నం): ఆదివాసీల అభి వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సంత్ సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు, చెంచులక్ష్మి, వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు ప్రభుత్వ పథకాలను పొందేందుకు ఆధార్ కార్డు సహా అవసరమైన పత్రాలను భద్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ, వీలైనంతవరకు ఒక గ్రామం లేదా ఒక ప్రాంతాన్ని స్థిర నివాసంగా చేసుకోవాలన్నారు. గిరిజనుల అభివృద్ధిలో విద్య అత్యంత కీలకమని పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం కుసుమహర యువ సేవా సంఘం సౌజన్యంతో కలెక్టర్ గిరిజన విద్యార్థులకు దుప్పట్లు, కండువాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర కిట్లను అందించారు. కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె. సత్యవతి, పర్యాటకశాఖ అధికారి జి.రామలక్ష్మణరావు, గిరిజన సంఘ నాయకులు బారోతు జ్యోతిలాల్ నాయక్, కుంభ రవి కిరణ్, కుంభ అయ్యప్ప, కందుల పవన్, మద్దెల పాండురంగారావు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది పీ శివకుమార్, ఇ.సుబ్రహ్మణ్యం, విద్యార్థులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ


