దుర్గమ్మ చెంత భక్తజన జాతర | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ చెంత భక్తజన జాతర

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

అంతరాలయ దర్శనం రద్దు..

టికెట్ల విక్రయాలు నిలిపివేత

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి, వరస సెలువులు, ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చెంత భక్తజన జాతర కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే కొండపైకి కేవలం దేవస్థాన బస్సులు, ద్విచక్ర వాహనాలను మినహా ఇతర వాహనాలను అనుమతించలేదు ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాలను నిలిపివేసి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం రెండు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. రద్దీ తాకిడితో వీఐపీ క్యూలైన్‌తో పాటు సీఎం గేట్‌ను సైతం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు.

కనకదుర్గానగర్‌లో పండుగ వాతావరణం

సారెతో ఆలయానికి బయలుదేరిన భక్తులు తొలుత కనకదుర్గానగర్‌లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమను సమర్పించారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఆటోలపై అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలిరావడం కనిపించింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్‌ డప్పులతో , భక్తుల పూనకాలతో సారె సంబరం అంబరాన్ని తాకింది.

సారె సమర్పించిన వందకు పైగా బృందాలు

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు వందకు పైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 30 వేల మందికి పైగా సారె సమర్పించారని పేర్కొంటున్నారు. ఆషాఢ మాసంలో ఈ ఆదివారం అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం, సారె సమర్పించడం సరికొత్త రికార్డు అని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈవో, చైర్మన్‌లతో పాటు డీఈవో కిషోర్‌కుమార్‌, ఏసీ రంగారావు, ఏఈవోలు చంద్రశేఖర్‌, రమేష్‌బాబు ఇతర అధికారులు క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement