సముద్రపు అంచున బరితెగిస్తున్న మట్టి మాఫియా భవిష్యత్తులో ప్రమాదమని తెలిసినా దందా మట్టి దోపిడీలో తెలుగు తమ్ముళ్ల పోటాపోటీ
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..
ఊరిలో మట్టి దందా యథేచ్ఛగా జరుగుతోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా మట్టి ట్రాక్టర్‌లు తిరుగుతున్నాయి. అక్రమ మట్టి తోలకాల్లో కూటమి నేతలు చక్రం తిప్పుతున్నారు. ఆఖరికి సముద్రపు అంచును కూడా వదలటం లేదు. వీళ్ల అవినీతిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో పెదపట్నం గ్రామాన్ని సముద్రం ముంచేసే ప్రమాదం ఉంది.
– గడిదేశి రాజు,
వైఎస్సార్ సీపీ గ్రామ ఇన్‌చార్జ్
కోనేరుసెంటర్: బందరు మండలం పెదపట్నం గ్రామంలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ అవినీతి, అక్రమాలకు ఊరిని, ఊరి జనాన్ని ముంచేందుకు సిద్ధపడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గ్రామంలో జరుగుతున్న వీరి దందాను అడ్డుకునే నాథుడు లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
విషయం ఏమిటంటే..
బందరు మండలం పెదపట్నం గ్రామంలో కొంత మంది తెలుగుతమ్ముళ్లు అసైన్డ్ భూములను ఆక్రమించేందుకు మట్టిమాఫియా అవతారమెత్తారు. కూటమి అధికారంలోకి రావటంతో సముద్రపు అంచున ఉన్న మట్టి దిబ్బలను మింగి సొమ్ము చేసుకోవటంతో పాటు ఆ భూములను అన్యాక్రాంతం చేసి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేందుకు పన్నాగం పన్నుతున్నారు. అందుకోసం గడిచిన ఇరవై రోజులుగా పెదపట్నం పంచాయతీ గొల్లపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని సముద్రపు అంచున ఉన్న మట్టిని మిషన్‌లతో తోడించి పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా ఇప్పటి వరకు దాదాపు ఐదు ఎకరాల్లో సుమారు 1000 ట్రక్కులకు తక్కువ కాకుండా మట్టిని మింగేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఊరి అభివృద్ధి పేరుతో..
మట్టి దందాతో పాటు భూ ఆక్రమణ వైపు అధికారులు కన్నెత్తి చూడకుండా గ్రామానికి చెందిన ఓ తెలుగుతమ్ముడు అడ్డుకుంటున్నట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అందుకే అధికారులు ‘మీనా(ల) ‘మే(వే)షాలు’ వేస్తున్నట్లు సమాచారం. ఊరిలో మట్టిరోడ్లను మెరక చేసే పని పేరుతో సదరు తెలుగుతమ్ముడు అవినీతికి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. సముద్రపు అంచున ఉన్న మట్టి దిబ్బలను మిషన్‌లతో తోడించి పేరుకు ఒక ట్రాక్టర్ మట్టిని ఊరి సందుల్లో పోయించి మిగిలిన ట్రాక్టర్‌లను ట్రిప్పుకు రూ.1200 చొప్పున వసూలు చేస్తూ ఉన్న ఊరితో పాటు పక్క ఊళ్లకు మట్టిని అక్రమంగా తరలించేస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. అందుకోసం మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తిని గట్టిగా ఉపయోగించి అతనికి ముడుపులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే తెలుగుతమ్ముడు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అతని సామాజికవర్గానికి చెందిన ఓ వృద్ధ నాయకుడి సహకారంతో సముద్రపు అంచున సుమారు 25 ఎకరాల అసైన్డ్ భూములను ఇదే తరహాలో స్వాహా చేసినట్లు సమాచారం.
తిలా పాపం తలా పిడికెడు..
ఇదిలా ఉండగా మట్టి దోపిడీ ద్వారా రూ.లక్షలకు లక్షలు కూడబెట్టిన సదరు తెలుగుతమ్ముడిని చూసి అదే గ్రామానికి చెందిన మరో తెలుగుతమ్ముడు అవినీతి, అక్రమాల్లో తాను తగ్గేది లేదంటూ మట్టి దోపిడీకి నడుం బిగించాడు. అందుకోసం అతను మట్టి మాఫియా అవతారమెత్తాడు. పార్టీ కోసం అతనే కాదు నేను కష్టపడి పనిచేశానంటూ రెవెన్యూ సిబ్బందిని బెదరేసి మట్టి అక్రమ రవాణాకు లోపాయికారికంగా అనుమతులు తెచ్చుకున్నట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అందుకు గ్రామంలోని ఓ కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారులకు పూర్తి సమాచారం ఉన్నా ఆ చిరు ఉద్యోగిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవటం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మట్టి తోలకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే ఊరిలోకి వెళ్లాం. మట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌లు, పొక్లయినర్‌ను పట్టుకుని జరిమానాలు కట్టించాం. మరలా ఇలాంటివి జరిగితే క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడం.
– చోడవరపు చంద్రశేఖర్, నార్త్ మండలం, ఆర్‌ఐ


