లారీ ఢీకొని ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

లారీ ఢీకొని ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం దొనబండ రాతి క్వారీలో ప్రమాదం.. వ్యక్తి మృతి

ఇబ్రహీంపట్నం: ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ మీడియెట్‌ విద్యార్థి వారణాసి భరధ్వాజ్‌(16) దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో నింపింది. విద్యార్థి దుర్మరణంపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక ఐశ్వర్య గ్రాండ్స్‌లో నివాసం ఉంటున్న వారణాసి శ్రీనివాస కుమారస్వామి, సంధ్యారాణి దంపతులకు ఇద్దరు కుమారులు. అర్చకత్వం చేసుకుంటూ కుమారులను చదివించుకుంటున్నారు. చిన్నకుమారుడు వారణాసి భరధ్వాజ్‌ భవానీపురంలోని కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఉదయం ఇబ్రహీంపట్నంకు స్కూటీపై వచ్చిన విద్యార్థి తిరుగు ప్రయాణంలో ఫెర్రీ నుంచి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న టిప్పర్‌ లారీ రింగ్‌ సెంటర్‌లో ఢీకొట్టింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని 108 సిబ్బంది హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

యువకుడి నేత్రదానం..

కన్నకుమారుడిని కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. యువకుడి కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేత్రాలు సేకరించారు. తమ విషాదాన్ని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేలా మార్చేందుకు కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురి హృదయాలను కదిలించింది. పోలీసులు యువకుడి పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పోలీసులు ప్రమాదానికి గురైన లారీని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌. రవివర్మ తెలిపారు.

కంచికచర్ల: క్వారీలోని పొక్లయినర్‌కు డీజిల్‌ తీసుకువెళ్తున్న క్రాంప్‌ వాహనం ప్రమాదానికి గురవటంతో క్రాంప్‌ డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన మండలంలో శనివారం రాత్రి సమయంలో జరిగింది. ఎస్‌ఐ పి. విశ్వనాథ్‌ కథనం మేరకు.. కంచికచర్ల మండలం దొనబండ రాతి క్వారీలో ఉన్న వర్చ్యూ క్వారీ, అండ్‌ క్రషర్‌లో ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి రాంబాబు(31) సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ప్రాంతంలో క్వారీ కొండపై బండరాళ్లను తొలగిస్తున్న పొక్లయినర్‌కు డీజిల్‌ అయిపోతే ఆ డీజిల్‌ను క్రాంప్‌ వాహనం ద్వారా తీసుకెళ్తున్నాడు. రాంబాబు క్రాంప్‌ వాహనాన్ని నడుపుకుంటూ వాహనం కొండపైకి ఎక్కే సమయంలో క్రాంప్‌ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టి క్వారీ బండను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంబాబు తలకు పెద్ద రాయి తగలటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్వారీ రోడ్డులో మృతుని బంధువుల ఆందోళన..

క్వారీ ప్రమాదంలో మృతిచెందిన రాంబాబు కుటుంబం గురించి పట్టించుకోకపోవటంతో క్వారీ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవటంతో బంధువులు క్వారీలో ఆందోళన చేపట్టారు. రాంబాబు కుటుంబానికి క్వారీ యాజమాన్యం న్యాయం చేయాలని, తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేయాలి. దీంతో క్వారీ, క్రషర్లలో నుంచి వచ్చే వాహనాలు రెండు గంటల పాటు రోడ్డుపై నిలిచిపోయాయి. పోలీసులు సర్దిచెప్పటంతో ఆందోళన విరమించారు.

మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ క్రషర్‌ వద్ద మృతుని బంధువుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement