టైరు పంచరై బోల్తా పడిన బొలెరో సత్తెన్నగూడెంకు చెందిన వ్యక్తి మృతి, పలువురికి గాయాలు కాకినాడ జిల్లా అన్నవరం వద్ద ఘటన
గండేపల్లి: కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందోత్సాహాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. అంత వరకు సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం చేస్తున్న వారికి దుఃఖమే మిగిలింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, అంజనాపురానికి చెందిన అల్లాడి గోపాలకృష్ణ, రాజేశ్వరి దంపతుల ఆరు నెలల చిన్నారి అరణ్య అన్నప్రాశనం నిమిత్తం కమ్మంపాడు, విజయవాడ, సత్తెన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన బంధువులు శనివారం వ్యాన్‌లో కాకినాడ జిల్లా అన్నవరానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి ఆదివారం ఉదయం అన్నప్రాశన అనంతరం వారు తలుపులమ్మ తల్లిని దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా వారి వాహనం మండలంలోని బొర్రంపాలెం శివారు భారత్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వ్యాన్ వెనుకభాగం ఎడమ వైపు టైర్ పంచరై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో చిన్నారికి వరసకు తాత అయ్యే సత్తెన్నగూడెంకు చెందిన అల్లాడి చిన్నారావు (46) అక్కడిక్కడే మృతి చెందగా మేడిపల్లి నాగేంద్రమ్మ, అట్లూరి స్నేహ, అన్నాబత్తుల సామ్రాజ్యంకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుని భార్య అల్లాడి సరోజిని, బోగి అశోక్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108, హైవే అంబులెన్స్‌లో జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారి నీలిమ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. చిన్నారావుకు కుమార్తె శిరీష, కుమారుడు సుధీర్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గంపేట సీఐ బి.తిరుపతి, గండేపల్లి ఎస్‌ఐ యూవీ శివనాగబాబు ప్రమాదం వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


